సీఎం జగన్ ఆర్డర్ : 40 రోజుల్లో ప్రాజెక్టులు అన్నీ నిండాలి

  • Publish Date - October 28, 2019 / 09:14 AM IST

ఇరిగేషన్ శాఖపై సీఎం జగన్ సమీక్షించారు. పోలవరం, వెలిగొండ, వంశధార సహా కొత్త ప్రతిపాదిత ప్రాజెక్టులపై సీఎం జగన్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సంవత్సరం వర్షాలు  విస్తారంగా కురిశాయనీ..అయినా ఇంత వరకూ చాలా వరకూ ప్రాజెక్టు పూర్తిగా నిండలేదనే విషయంపై జగన్ ఆరా తీశారు. ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన కాలువ సామర్థ్యం, పెండింగ్ పనులపై పూర్తి సమాచారం ఇవ్వాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

భారీగా పడుతున్న వర్షాలతో వరద నీరు భారీగా ప్రాజెక్టులకు తరలుతోందనీ కాబట్టి ఈ నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వచ్చే 40 రోజుల్లో ప్రాజెక్టులన్నీ నిండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని..నీటితో ప్రాజెక్టులు నింపడటంపై ప్రతిపాదనలు సిద్ధం చేసి పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. 

ఇరిగేషన్ శాఖ నిధులు వినియోగంలో జాగ్రత్తలు పాటించాలనీ.. నిధులను అవసరానికి మాత్రమే ఖర్చు చేయాలని దుర్వినియోగం చేయవద్దని  సీఎం జగన్ సూచించారు. ఖర్చుకు తగిన ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.