ఏపీలో జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విజయవాడలోని కృష్ణ నది కరకట్టపై ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తున్న సీఆర్డీఏ.. అక్టోబర్ 17వ తేదీ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. శివ స్వామికి చెందిన ఆశ్రమ నిర్మాణాలను కూల్చివేసింది. భారీ జేసీబీలు, పొక్లెయినర్లతో వచ్చిన అధికారులు.. భారీ భవనాలను నేలమట్టం చేశారు.
శివ స్వామికి చెందిన ఆశ్రమం కృష్ణ నది కరకట్టపై ఉంది. గతంలోనూ పలుమార్లు నోటీసులు ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు ఉన్నాయని.. వాటిని తొలగించాలని ఆదేశించారు అధికారులు. వీటికి స్పందన రాకపోవటంతో స్వయంగా రంగంలోకి దిగింది ప్రభుత్వ యంత్రాంగం. ఆశ్రమానికి చెందిన బాత్ రూమ్స్, క్యాంటీన్లు నదికి ఆనుకుని ఉన్నాయి. వాటిని కూల్చివేశారు.
కరకట్టపై ఉన్న ఎవర్నీ వదిలేది లేదని ఈ ఘటనతో మరోసారి స్పష్టం చేసింది జగన్ ప్రభుత్వం. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రతి భవనాన్ని కూల్చివేయనున్నట్లు స్పష్టం చేసింది. ఎంతటి వారైనా సరే.. ఎవరైనా సరే ఇదే విధమైన ట్రీట్ మెంట్ ఉంటుందని, వదిలేది లేదని శివ స్వామి ఆశ్రమంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతతో సంకేతాలు పంపింది ప్రభుత్వం.