బసవతారకం ట్రస్టీ తులసీదేవి ఇక లేరు

  • Publish Date - October 13, 2019 / 02:57 AM IST

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి వ్యవస్థాపక ట్రస్టీగా ఉన్న డాక్టర్ పోలవరపు తులసీదేవి (80) తుదిశ్వాస విడిచారు. ఆస్పత్రి స్థాపంలో కీలక పాత్ర పోషించారు. అక్టోబర్ 12వ తేదీ శనివారం న్యూయార్క్‌లోని తన నివాసంలో ఆమె కన్నుమూశారు. ఆమె మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, బసవతారకం ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియచేశారు. 

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామానికి చెందిన ఈమె..న్యూయార్క్‌లో గైనకాలజిస్టుగా స్థిరపడ్డారు. ఆమె భర్త డాక్టర్ రాఘవరావు ఆర్థోపెడిక్ సర్జన్ వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. పేద రోగులకు అందుబాటు ధరల్లో చికిత్స అందించాలని, ప్రపంచ శ్రేణి క్యాన్సర్ చికిత్స కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఆస్పత్రి ఏర్పాటు చేయాలని ఎన్టీరామారావు సంకల్పించారు.

ఎన్టీఆర్ ఆశయానికి భర్త డాక్టర్ పోలవరపు రాఘవరావుతో కలిసి ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి సహకరించారు తులసీదేవి. ఈ సంస్థ ద్వారా అమెరికాలోని ప్రసిద్ధ వైద్యులతో పాటు ఇక్కడి తెలుగు వైద్యులను ఏకం చేసి సంస్థ స్థాపనకు నిధులు, అత్యాధునిక వైద్య పరికరాలు అందించడంలో కీలక పాత్ర పోషించారు. అప్పటి నుంచి వ్యవస్థాపక కార్యవర్గ సభ్యలుగా ఉన్నారు. తండ్రి కారుమంచి గోవిందయ్య పేరిట కొండూరులో ఉన్నత పాఠశాలను నెలకొల్పారు. అమెరికాలో వైద్య పరీక్షలు, ఇతరత్రా లాంఛనాలు పూర్తయిన తర్వాత..భౌతికకాయాన్ని స్వగ్రామానికి తీసుకొస్తామని కుటుంబసభ్యులు వెల్లడించారు. 
Read More : జల్, జంగిల్, జమీన్‌ : కొమరం భీమ్ వర్ధంతి