ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖను దాదాపుగా నిర్ణయించేసిన ఏపీ సర్కార్.. ఆ విషయానికి ఆమోద ముద్ర వేయడానికి డిసెంబర్ 27వ తేదీన కేబినెట్ సమావేశం నిర్వహించేందుకు సిద్ధం అవుతుంది. జీఎన్ రావు ఇచ్చిన కమిటీ నివేదికపై చర్చ జరిపి ఆమోదముద్ర వేసేందుకు ప్లాన్ చేస్తుంది ప్రభుత్వం. జీఎన్ రావు కమిటీ నివేదికపై కేబినేట్‌లో చర్చ జరిపి అక్కడే దీనిపై కీలక నిర్ణయం తీసుకుంటారు.
జీఎన్ రావు ఇచ్చిన రిపోర్ట్‌లో ఏమైనా మార్పులు చేయాలా? అనే విషయాలపై చర్చలు జరపనున్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నిర్ణయాన్ని విశాఖలోనే ప్రకటిస్తే బాగుంటుందనే ఉద్ధేశ్యంతో అక్కడే కేబినేట్ భేటి పెట్టాలనేది ఆలోచన. అందుకే 27వ తేదీన కేబినెట్ సమావేశాన్ని సాగరతీరంలో నిర్వహించే ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది ఉన్నతాధికారులకు ఈ సమాచారం వెళ్లినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అమరావతి రైతులు రాజధాని ప్రాంతంలో ఆందోళన చేస్తున్నారు. ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి.
ఈ సమయంలో ఏ ఒక్క వైసీపీ నేత కూడా అటు వైపు వెళ్లే పరిస్థితి లేదు. మంత్రులు కూడా వారం రోజులుగా.. సచివాలయం వైపు వెళ్లట్లేదు. ఆ ప్రాంత ఎమ్మెల్యేలు కూడా అక్కడ కనిపించట్లేదు. ఇటువంటి సమయంలో అమరావతిలో కేబినేట్ ఏ కాదు.. పాలన సాధ్యం కాదు అని ప్రభుత్వ వర్గాలు అంచనాకు వచ్చాయి. ఈ క్రమంలో కేబినేట్ భేటిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.