ప.గో.: పెంటపాడులో టీడీపీ ఎన్నికల ప్రచార సభలో వైసీపీ చీఫ్ జగన్ పై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఓటర్లకు వైసీపీ నేతలు డబ్బు పంచుతున్నారని ఆరోపించిన చంద్రబాబు.. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఆ డబ్బు కేసీఆర్ ఇచ్చారో, మోడీ ఇచ్చారో చెప్పాలని జగన్ ని డిమాండ్ చేశారు. ఏపీకి మోడీ, కేసీఆర్ అన్యాయం చేశారన్న చంద్రబాబు.. అలాంటి వ్యక్తులకు జగన్ వంతపాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ద్రోహం చేస్తున్న వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. జగన్ పై 31 కేసులు ఉన్నాయని అన్నారు. అలాంటి వ్యక్తితో నాకు పోలిక పెడతారా అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం తాను 29సార్లు ఢిల్లీకి వెళ్లానని చంద్రబాబు చెప్పారు. రోజుకో మాట చెప్పి మోడీ యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. ఏపీకి రావాల్సిన వాటా ఇవ్వకుండా కేసీఆర్ అవమానిస్తున్నారని సీరియస్ అయ్యారు. పోలవరం నీళ్లు ఏపీకి రాకుండా కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కోడికత్తి కేసు చిన్నదే అయినా ఎన్ఐఏ విచారణ వేశారని అన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీని ఇబ్బందిపెట్టేందుకు కుట్రలు పన్నారని, అధికారులను ఇష్టమొచ్చినట్టు మారుస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. నిన్న సీఎస్ ను మార్చారు, రేపు ఎవరిని మారుస్తారో తెలియదు అన్నారు.
కోటిమందికి రూ. లక్ష కోట్ల ఆర్థిక సాయం చేశానని చంద్రబాబు చెప్పారు. భవిష్యత్ లో రూ.2లక్షల కోట్లు ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల ఆదాయం పెంచడమే తమ ప్రధాన కార్యక్రమం అని తెలిపారు. బీసీలకు తాను అండగా ఉంటానని, వారి అభివృద్ధికి సహకరిస్తానని చంద్రబాబు చెప్పారు. టీడీపీ అధికారంలోకి వస్తే స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి చేస్తామని.. డిగ్రీ కాలేజీ, సమ్మర్ స్టోరేజీలు నిర్మిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని స్థానాలను గెలిపించి టీడీపీకి కానుకగా ఇవ్వాలని చంద్రబాబు అభ్యర్థించారు.