ఏపీ సీఎం జగన్ బుధవారం (ఫిబ్రవరి 12, 2020) ఢిల్లీలో పర్యటించనున్నారు. మూణ్నెల్ల విరామం తర్వాత సీఎం జగన్… మరోసారి ప్రధాని నరేంద్రమోడీతో భేటీ కానున్నారు.
ఏపీ సీఎం జగన్ బుధవారం (ఫిబ్రవరి 12, 2020) ఢిల్లీలో పర్యటించనున్నారు. మూణ్నెల్ల విరామం తర్వాత సీఎం జగన్… మరోసారి ప్రధాని నరేంద్రమోడీతో భేటీ కానున్నారు. సాయంత్రం ప్రధాని సమావేశం కానున్నారు. ప్రాజెక్టులకు నిధులు, ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల సాధనే లక్ష్యంగా జగన్ పర్యటన సాగనుంది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈసారి జగన్ టూర్ ఆసక్తికరంగా మారింది.
విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఏర్పాటుపై చర్చ
కొద్ది నెలలుగా ప్రధానితో పాటు హోంమంత్రి అమిత్ షాను కలిసేందుకు జగన్ ప్రయత్నించారు. అయితే పౌరసత్వ బిల్లు అంశం.. హర్యానా, ఢిల్లీ ఎన్నికల హడావుడి కారణంగా అపాయింట్‌మెంట్ దొరకలేదు. ఇవాళ రావాలంటూ ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో జగన్ ఢిల్లీ వెళ్తున్నారు. సాయంత్రం ప్రధాని మోదీని కలిసి కీలక అంశాలపై చర్చించబోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే మండలి రద్దు బిల్లుల్ని ప్రవేశ పెట్టాలని ప్రధానిని కోరే అవకాశముంది. అలాగే విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఏర్పాటుపైనా ప్రధానికి వివరించి… ఆయన అనుమతి తీసుకుంటారని ప్రచారం సాగుతోంది.
ఆర్థిక పరిస్థితులపై ప్రధానికి వివరణ
ప్రధానితో భేటీలో ఏపీలో పాలనా వికేంద్రీకరణ గురించి కూడా జగన్ వివరించనున్నారు. కర్నూలుకు హైకోర్టును తరలించాలంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి సవరణ చేయాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపైనా మోదీతో చర్చించే అవకాశముంది ప్రభుత్వ వర్గాల సమాచారం. ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, విభజన చట్టం ప్రకారం రావాల్సిన రెవిన్యూ లోటుతో పాటు రాష్ట్రాభివృద్ధికి ఉదారంగా నిధులు విడుదల చేయాలని సీఎం జగన్ కోరనున్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేకంగా నిధులు ఇవ్వకపోవటంతో.. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితుల్ని ప్రధానికి వివరించాలని సీఎం భావిస్తున్నారు.
ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై ఈడీకి సీఐడీ లేఖ
అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ ఇప్పటికే ఈడీకి లేఖ రాసింది. ఈ అంశంపైనా చర్చించే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ఏపీలో జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. వైసీపీ ప్రభుత్వ విధానాలపై కలిసి పోరాటం చేయాలని నిర్ణయించాయి. ఈ పొత్తు ఖరారైన తరువాత తొలిసారి ఢిల్లీ వెళ్తున్న జగన్… కేంద్రంతో తాను సత్సంబంధాలు కోరుకుంటున్నట్లుగా స్పష్టం చేసే అవకాశం ఉంది.