రాజధాని రైతులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఎవ్వరికీ అన్యాయం చేయడం లేదని తెలిపారు. అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తున్నామని చెప్పారు.
రాజధాని రైతులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఎవ్వరికీ అన్యాయం చేయడం లేదని తెలిపారు. అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తున్నామని చెప్పారు. అమరావతిలోనే లెజిస్లేటివ్ క్యాపిటల్ కొనసాగుతుందని వెల్లడించారు. సీఎం సీట్లో కూర్చున్నప్పుడు తండ్రిలా ఆలోచించాల్సి ఉంటుందన్నారు. అమరావతి ఇటు విజయవాడ కాదు…అటు గుంటూరు కాదన్నారు. అమరావతి ప్రాంతంలో సరైన రోడ్లు, డ్రైనేజీ, పైపు లైన్లు లేవని చెప్పారు. లక్ష కోట్లు అవసరమైన చోట రూ.6 వేల కోట్లు ఎక్కడ సరిపోతాయన్నారు.
రాజధాని రైతుల అంశాలు నెరవేర్చడం ప్రభుత్వం బాధ్యత
ఐదేళ్ల తర్వాత మళ్లీ మన పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఉద్యోగాల కోసం మన పిల్లలు హైదరాబాద్, బెంగళూరు వెళ్లాల్సివస్తుందన్నారు. అదే ఖర్చులో 10 శాతం విశాఖపై పెడితే ఎంతో అభివృద్ధి చెందుతున్నారు. కనీసం వచ్చే కాలంలోనైనా మన పిల్లలకు ఉద్యోగాలొస్తాయని చెప్పారు. రాజధాని రైతులు లేవనెత్తిన అంశాలన్నీ నెరవేర్చడం ప్రభుత్వం బాధ్యత అన్నారు. రాజధానిలో మీ గ్రామాల్లో ఏం కావాలో స్పష్టంగా చెప్పాలన్నారు.
రైతులను సీఎం దగ్గరకు తీసుకెళ్లిన ఎమ్మెల్యేలు ఆర్కె, శ్రీదేవి
ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, శ్రీదేవితో కలిసి రాజధాని ప్రాంత రైతులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. రాజధాని ప్రాంతాలైనా తాడికొండ, మంగళగిరి నియోజవకర్గాలకు చెందిన రైతులంతా సీఎం జగన్ ను కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ ను కలిశారు. సీఎంతో రైతులు సమావేశం అయ్యారు. దాదాపు 60 నుంచి 70 మంది రైతులు సీఎంను కలిశారు. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఆర్కె, శ్రీదేవి రైతులను సీఎం దగ్గరకు తీసుకెళ్లారు.
రైతులు, సీఎం జగన్ మధ్య కీలకమైన చర్చలు
రైతులు, సీఎం జగన్ మధ్య కీలకమైన చర్చలు సాగాయి. రాజధాని తరలింపుపై సీఎంకు రైతులు తమ సమస్యలు తెలిపారు. తమ సమస్యలు, రాజధాని ప్రాంతానికి సంబంధించి తమకున్న అనుమానాలు, అపోహలను పూర్తిస్థాయిలో సీఎంకు వివరించారు. మరోవైపు రైతులంతా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో రాజధాని ప్రాంత రైతులు సీఎం జగన్ ను కలవడం చర్చనీయాంశం అయింది.
అమరావతి రాజధాని విషయంలో రెండు వాదనలు
అమరావతి రాజధాని విషయంలో రెండు వాదనలు వినిపిస్తున్నాయి. కొంతమంది రాజధాని అమరావతిలోనే ఉండాలని, రాజధాని విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ మరికొంతమంది వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాడికొండ, మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి, పెదపాక, బేతపూడి గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతులు సీఎం జగన్ ను కలిశారు. అభివృద్ధి వికేంద్రీకరణకు అనుకూలంగా ఇప్పటికే కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.