రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ తో ఏపీ సీఎం జగన్ సమావేశం అయ్యారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులను గవర్నర్ కు వివరించే అవకాశం ఉంది.
రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ తో ఏపీ సీఎం జగన్ సమావేశం అయ్యారు. జగన్ తోపాటు ఆయన సతీమణి భారతి కూడా గవర్నర్ ను కలిశారు. గవర్నర్ కు జగన్ శాలువా కప్పగా, గవర్నర్ సతీమణికి భారతి శాలువా కప్పి సత్కరించారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులను సీఎం జగన్..గవర్నర్ కు వివరించే అవకాశం ఉంది. రాజధాని మార్పుపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికను సీఎం జగన్.. గవర్నర్ కు వివరించనున్నారు. అలాగే ఏపీ రాజధాని మార్పు, మూడు రాజధానుల అంశాలు కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఇటీవల జరిగిన అసెంబ్లీలో సీఎం జగన్ మాట్లాడుతూ సౌతాఫ్రికా లాగా ఏపీకి మూడు రాజధానులు ఎందుకు ఉండకూడదన్నారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్, కర్నూలులో జ్యుడీషియల్ కేపిటల్ ఉండొచ్చని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల ముగిసిన అనంతరం రాజధాని అధ్యయనానికి జీఎన్ రావు కమిటీ వేశారు.
రాజధాని విషయంలో బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) మరో అధ్యయన కమిటీని ప్రభుత్వం నియమించింది. జీఎన్ రావు కమిటీ నివేదిక, బీసీజీ నివేదికలు వచ్చాక రాజధాని మార్పు, అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
మరోవైపు అమరావతి రాజధాని మార్పు, మూడు రాజధానుల ప్రతిపాదనలపై విపక్షాలు, అమరావతి రాజధాని ప్రాంత రైతులు భగ్గుమంటున్నారు. పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. రాజధాని మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమరావతిలోనే రాజధాని ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తో సీఎం జగన్ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.