మహిళా రిజర్వేషన్పై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కీలక ప్రకటన చేశారు. 2019లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామంటూ రాహుల్ గాంధీ ప్రకటించారు. మార్చి 09వ తేదీ శనివారం శంషాబాద్‌లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగసభ నిర్వహించింది. ఈ సభలో పాల్గొన్న రాహుల్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై నిప్పులు చెరిగారు. ధనికుల కోసం మోడీ పని చేస్తున్నారని, పెట్టుబడి దారులకు లాభం చేకూర్చేలా ఆయన వ్యవహరిస్తున్నారంటూ దుయ్యబట్టారు. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి పారిపోయినా మోడీ పట్టించుకోరని విమర్శించారు.
Read Also : అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లో రైతుల రుణాలు మాఫీ చేస్తాం: రాహుల్
మార్చి 08వ తేదీన మహిళా దినోత్సవం ఉంటే..అదే రోజున UP రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే మహిళపై అత్యాచారం చేసినా పీఎం మోడీ ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదన్నారు. అంతేగాకుండా అత్యాచార ఘటనపై కనీసం ఎంక్వయిరీ చేయలేదన్నారు. మోడీ పాలనలో మహిళలు బయటకు తిరగలేని పరిస్థితి ఉందని..భయంతో కాలం గడుపుతున్నారని పేర్కొన్నారు. అధికారంలోకి కాంగ్రెస్ రాగానే మహిళా రిజర్వేషన్ అమలు చేసి తీరుతామని హామీనిచ్చారు. లోక్ సభ, రాజ్యసభలలో రిజర్వేషన్ బిల్లు పాస్ అయ్యే విధంగా చూస్తామని, అన్నిసభలలో మహిళలు కనబడుతారని ప్రకటించారు. మహిళలపై ఎలాంటి ఘటనలకు పూనుకున్నా..కఠినంగా చూస్తామని రాహుల్ వెల్లడించారు.