దసరా పండుగ సందర్భంగ శ్రీ రాజరాజేశ్వరీ దేవిని దర్శించుకునేందుకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ భారీగా పెరుగుతోంది. అమ్మవారి కటాక్షం పొందేందుకు అర్థరాత్రి నుంచే భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. దీంతో ఆలయం కిక్కిరిసిపోయింది. అమ్మవారి దర్శనం కోసం సాధారణ భక్తులతోపాటుగా.. భవానీ దీక్షలు చేపట్టిన భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు.
ఇక దసరా శరన్నవరాత్రుల్లో తొమ్మిదో రోజైన సోమవారం (అక్టోబర్ 7, 2019) అమ్మవారు శ్రీమహిషాసుర మర్దనీ దేవిగా దర్శనమిచ్చారు. ఇవాళ తెప్పోత్సవం.. దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా నేడు సాయంత్రం 5 గంటలకు కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహించనున్నారు. హంస వాహన సేవలో గంగ, పార్వతి సమేత మల్లేశ్వరస్వామిని మూడుసార్లు జలవిహారం చేయించనున్నారు. అక్కడితో శమపూజతో దసరా ఉత్సవాలు ముగియనున్నాయి.
తెప్పోత్సవం కోసం స్పెషల్ లైటింగ్ డెకరేషన్, రకరకాల రంగుల లైట్లు, పుష్పమాలలతో తెప్పను అలంకరించారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో రానున్నారు. వారికి అసౌకర్యం కలగకుండా పోలీసులు భారీ సెక్యూరిటీ కల్పించనున్నట్లు తెలిపారు.