భారీ వర్షాలతో అల్లాడుతున్న అనంతపురం

  • Publish Date - September 24, 2019 / 10:34 AM IST

అనంతపురం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కళ్యాణదుర్గంలో వాగులు..వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు నివాసాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. వేలాది ఎకరాల్లో పంట నీటి మునిగిపోవటంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు.  రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. జిల్లాలో పరిస్థితి ఇలా ఉంటే..మరో రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా ఎటువంటి కష్టాలు పడాలి దేవుడా..అంటూ అనంతవాసులు భయాందోళనలకు గురవుతున్నారు. 

వరదనీటి ఉదృతికి ఇప్పటికే పలు ఇల్లు కొట్టుకుపోయాయి. చాలావరకూ ఇళ్లు నేలమట్టమయ్యాయి. గోడలు కూలిపోయిన ఇళ్లలో ఉండలేక ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలుతున్నారు. గుత్తిలో కురుస్తున్న వర్షాలకు రోడ్లా..చెరువులా అనే  తేడా లేకుండా కనిపిస్తున్నాయి. గుత్తి మున్సిపల్ కార్యాలయంలోకి భారీగా వర్షపు నీరు చేరుకుంది. అలాగే యాడికి మండలంలోకూడా భారీ వర్షం కురిసింది. లక్ష్మంపల్లిలో కురిసిన భారీ వర్షానికి ఓ ట్రాక్టర్ తో పాటు మోటార్ సైకిళ్లు కొట్టుకుపోయాయి.

పలు గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకుపోయాయి. యాడికి మండలం తిమ్మేపల్లి గ్రామంలో వరద నీటితో నిండిపోయిన ఓ చెరువు గట్టుకు గండి పడింది. వరద నీరంతా గ్రామంలోకి చేరుకుంది. భారీ వర్షాలకు పలు ఇబ్బందులు పడుతున్న ప్రజలు కనీసం ఆహారం వండుకోవటానికి కూడా దారిలేక ఆకలితోనే ఉండిపోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ క్రమంలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించటంతో అనంతపురం జిల్లా వాసులు భయాందోళనలకు గురవుతున్నారు.