ప్రజలను దగా చేసిన చంద్రబాబు : జగన్

  • Publish Date - April 9, 2019 / 02:24 PM IST

రాష్ట్ర ప్రజలను చంద్రబాబు దగా చేశారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు జగన్‌ విమర్శించారు. హామీలను అమలు చేయకుండా రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులను మోసం చేశారని తెలిపారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి చాలా మంది అద్దె నేతలను తీసుకొచ్చారని వారిలో ప్రత్యేక హోదాకు ఒక్కరైనా మద్దతిచ్చారా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై తోడుగా ఉంటామని ఒక్క నేతతోనైనా చెప్పించగలిగారా అని నిలదీశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం తిరుపతిలో చివరి బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాలనలో ప్రతి ఒక్కరికి భరోసా ఉండేదన్నారు. నిన్నటి కన్నా ఈ రోజు బాగుంటే అభివృద్ధి అంటామని, కానీ చంద్రబాబు పాలనలో పరిస్థితులు పూర్తి భిన్నంగా మారాయన్నారు. 

ప్రస్తుతం కాలేజీలకు వెళ్లాలంటే ఫీజులు లక్షల్లో ఉన్నాయన్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌ రూ.30వేలు ఇస్తున్నారని అది కూడా అరకొర ఇస్తూ రూ.18వేల కోట్లు బకాయి పడ్డారని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి పాలనలో ఏ పేదవాడికి ఆరోగ్యం బాగలేకపోయినా, ప్రమాదం సంభవించినా 108కు ఫోన్‌ కొడితే కుయ్‌కుయ్‌ అని అంబులెన్స్‌ వచ్చేదని.. ఇప్పుడు 108కు ఫోన్‌ కొడితే వస్తుందో? లేదో? అని భయంతో ఉండాల్సిన పరిస్థితి ఉందన్నారు. గుండెపోటు, న్యూరో సర్జరీ వంటి వ్యాదుల నయం కోసం పెద్ద ఆసుపత్రులకు వెళ్లాలని కానీ అవి హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉన్నాయని అక్కడ చికిత్స చేసుకుంటే ఆరోగ్య శ్రీ కట్‌ చేస్తున్నారని తెలిపారు. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయాలన్నారు. 

ఈ రాజకీయాల్లో మార్పు రావాలని ఆకాంక్షించారు. ఒక నాయకుడు ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే.. రాజీనామా చేసి వెళ్లిపోయే పరిస్థితులు రావాలన్నారు. ఇది ఒక్క జగన్‌తో సాధ్యం కాదని.. రెండు రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఈ మార్పు కోసం ఓటేయ్యాలని కోరారు. అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని హామీ ఇచ్చారు.