గుడ్ న్యూస్: 18న కరీంనగర్ ఐటీ టవర్‌ ప్రారంభం

  • Publish Date - February 11, 2020 / 01:52 AM IST

కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన ఐటీటవర్‌ ను ఈ నెల(ఫిబ్రవరి 18, 2020)వ తేదీన ఉదయం 10 గంటలకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభించనున్నట్టు  బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌ తెలిపారు.   

ఈ సందర్భంగా వినోద్‌ కుమార్‌, మంత్రి గంగుల మీడియాతో మాట్లాడుతూ..ఇక ఈ టవర్ను ప్రారంభిస్తే నిరుద్యోగ యువతకు ఎక్కడికక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చని తెలిపారు. ఇక్కడ పనిచేసేందుకు 26 కంపెనీలు ప్రభుత్వాన్ని సంప్రదించగా.. ఇప్పటికే 15 కంపెనీలకు స్థలం కేటాయించినట్టు చెప్పారు. అంతేకాదు మొత్తం మూడు షిప్టుల్లో కలిపి మూడు వేలమందికిపైగా ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. 

80శాతం ఉద్యోగాలు స్థానికులకే లభించేలా చర్యలు తీసుకొంటున్నామని వివరించారు. ఇక ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే వచ్చే ఏడాదిలో మరో టవర్‌కు డిమాండ్‌ వచ్చేలా ఉన్నదని, దీనికి కూడా స్థలం కేటాయిస్తామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, కరీంనగర్‌ మేయర్‌ వై సునీల్‌రావు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఆరెపల్లి మోహన్‌, ఎడవల్లి విజయేందర్‌రెడ్డి, చల్లా హరిశంకర్‌, కొత్తపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ రుద్రరాజు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.