భువనగిరి ఖిల్లాపై ఎగిరేది ఎవరి జెండా ? 

ఒకరు సిట్టింగ్ ఎంపీ.. ఇంకొకరు రాజకీయాల్లో సీనియరే అయినా తొలిసారి పార్లమెంట్ బరిలో నిల్చిన నేత.

  • Publish Date - April 6, 2019 / 12:36 PM IST

ఒకరు సిట్టింగ్ ఎంపీ.. ఇంకొకరు రాజకీయాల్లో సీనియరే అయినా తొలిసారి పార్లమెంట్ బరిలో నిల్చిన నేత.

ఒకరు సిట్టింగ్ ఎంపీ.. ఇంకొకరు రాజకీయాల్లో సీనియరే అయినా తొలిసారి పార్లమెంట్ బరిలో నిల్చిన నేత. ఎలాగైనా గెల్చి పరువు నిలుపుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే.. రాష్ట్రంలో అధికారంలో ఉంది తామే కాబట్టి.. విజయం గ్యారెంటీ అని టీఆర్ఎస్ ధీమాగా ఉంది. అయితే… మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ – టీఆర్ఎస్ మధ్య ఓట్ల తేడా స్వల్పంగా ఉండటంతో.. భువనగిరి లోక్‌సభ ఎన్నిక ఆసక్తి కలిగిస్తోంది. నియోజకవర్గాల పునర్విభనతో 2009లో భువనగిరి పార్లమెంట్ స్థానం ఏర్పడింది. భువనగిరి లోక్‌సభ పరిధిలో 16లక్షల 27 వేల 527 మంది ఓటర్లుండగా… 8 లక్షల 18వేల 572మంది పురుషులు.. 8 లక్షల 8 వేల 925 మంది మహిళలున్నారు. 

మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవగా..2014లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. ఈసారి టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ బరిలో ఉండగా.. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తొలిసారిగా లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. బీజేపీ తరఫున ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్.. సీపీఎం – సీపీఐ ఉమ్మడి అభ్యర్థిగా గోదా శ్రీరాములు పోటీ పడుతున్నారు. 
Read Also : జియో రోమింగ్ Unlimited రీఛార్జ్ ప్లాన్స్ ఇవే

భువనగిరి లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, జనగామ, ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్నారు. మునుగోడు, నకిరేకల్‌లో కాంగ్రెస్ విజయం సాధించింది. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్‌లో చేరడంతో.. ప్రస్తుతం ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బూరనర్సయ్య గౌడ్‌కు మద్దతుగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన బూర నర్సయ్య గౌడ్… కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌‍రెడ్డిపై కేవలం 30 వేల 494 ఓట్లతో మాత్రమే విజయం సాధించారు. బూర నర్సయ్యగౌడ్‌పై పార్టీలో కాస్త వ్యతిరేకత ఉంది. అలాగే.. పార్టీలో కీలక నేతలతో ఆయనకు సఖ్యత లేదనే వాదన కూడా ఉంది. అభ్యర్థి విజయానికి కృషి చేయాలని అధినేత కేసీఆర్ ఆదేశించడంతో… బూర గెలుపు కోసం పార్టీ శ్రేణులు శ్రమిస్తున్నారు. 

కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆయన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి ఒక్కరే సపోర్ట్‌గా ఉన్నారు. వెంకటరెడ్డి గట్టిపోటీ ఇస్తున్నా… ఆయనకు భువనగిరికంటే నల్గొండలోనే ఎక్కువ సానుకూలాంశాలున్నాయి. నియోజవర్గం పరిధిలో కోమటిరెడ్డి బ్రదర్స్‌కు వ్యక్తిగతంగా అనుచరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అటు పార్టీ కేడర్‌‍ కూడా సపోర్ట్ చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నైరాశ్యం నుంచి అనుచరులను బయటపడేయాలన్నా… అధిష్టానం దగ్గర పరువు నిలబెట్టుకోవాలన్నా.. పొలిటికల్‌గా లైవ్ ఫ్రేమ్‌లో ఉండాలన్నా ఈ ఎన్నికల్లో కోమటిరెడ్డి విజయం సాధించాల్సి ఉంది. మరి ఈసారి ప్రజలు ఎవరికి ఓటేస్తారో చూడాలి. 
Read Also : వరంగల్ ఎవరికి వరం : కాంగ్రెస్‌కు కలిసొస్తుందా? కారు దూసుకుపోతుందా?