ఏపీలో 4 కోట్లకుపైగా ఓటర్లు…మహిళలే అధికం

  • Publish Date - February 15, 2020 / 03:05 AM IST

ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల సంఖ్య తొలిసారిగా 4 కోట్ల మార్కును దాటింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌) తర్వాత ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్‌ శుక్రవారం (ఫిబ్రవరి 14, 2020) విడుదల చేశారు. దీని ప్రకారం.. గత సాధారణ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 6,57,065 పెరిగింది. దీంతో రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,93,45,717 నుంచి 4,00,02,782కు చేరుకుంది. కొత్తగా పెరిగిన ఓటర్లలో పురుష ఓటర్ల కంటే మహిళలే అధికంగా ఉన్నారు.

రాష్ట్రంలో 65,388 మంది సర్వీసు ఓటర్లు 
గత ఎన్నికలతో పోలిస్తే పురుష ఓటర్ల సంఖ్య 1,94,62,339 నుంచి 1,97,90,730కు చేరగా, మహిళా ఓటర్ల సంఖ్య 1,98,79,421 నుంచి 2,02,07,984కు చేరుకుంది. థర్డ్‌ జెండర్‌ ఓటర్ల సంఖ్య 111 పెరిగి, మొత్తం 4,068గా నమోదైంది. సవరణ తర్వాత పురుష ఓటర్ల కంటే 4,17,254 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. మొత్తం 13 జిల్లాల్లో శ్రీకాకుళం, అనంతపురం మినహాయిస్తే మిగిలిన 11 జిల్లాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉండడం గమనార్హం. రాష్ట్రంలో 65,388 మంది సర్వీసు ఓటర్లు ఉన్నట్లు జాబితాలో పేర్కొన్నారు. 

తగ్గిన పోలింగ్‌ స్టేషన్ల సంఖ్య
ఓటర్ల సంఖ్య పెరిగినా రాష్ట్రంలో పోలింగ్‌ స్టేషన్ల సంఖ్య తగ్గడం గమనార్హం. ప్రతి 1,500 మందికి ఒక పోలింగ్‌ స్టేషన్‌ ఉండే విధంగా కసరత్తు చేసినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. కొత్తగా 437 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయగా, 521 పోలింగ్‌ స్టేషన్లను విలీనం చేసింది. దీంతో మొత్తం పోలింగ్‌ స్టేషన్ల సంఖ్య 45,920 నుంచి 45,836కు తగ్గింది. ఎస్‌ఎస్‌ఆర్‌లో భాగంగా 2019 డిసెంబర్‌ 23వ తేదీన 3,98,34,776 ఓటర్లతో జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. 

ఓటర్ జాబితాపై అభ్యంతరాలు
దీనిపై ప్రజల నుంచి అభ్యంతరాలను కోరింది. 1,63,030 ఓటర్లను చేర్చాలని, 60,412 ఓటర్లను తొలగించాలని అభ్యర్థనలు వచ్చినట్లు విజయానంద్‌ తెలిపారు. నికరంగా 1,02,618 ఓటర్లను జత చేసి, ఓటర్ల తుది జాబితాను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఓటర్‌ ఫొటో గుర్తింపు కార్డులను ఓటర్లకు వారి ఇంటి వద్దనే అందించే ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.  
 

Read Here>>మెరుపు వేగం : ఉసేన్ బోల్ట్ రికార్డ్ ను బద్దలుకొట్టిన భారతీయుడు