రాష్ట్రంలో తుగ్లక్ పాలన: అన్నం వడ్డించి.. హెల్మెట్ లు పంచిన నారా లోకేష్

  • Publish Date - September 4, 2019 / 08:37 AM IST

తెలుగుదేశం నాయకులు.. మాజీ మంత్రి నారా లోకేష్ విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడి పుట్టిన రోజు సందర్భంగా నర్సీపట్నం వెళ్లిన నారా లోకేష్ కు అక్కడి టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. నర్సీపట్నం చేరుకున్న తర్వాత లోకేష్ అయ్యన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సంధర్భంగా జగన్ ప్రభుత్వంపై నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. తుగ్లక్ పరిపాలన గురించి చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నామని… ఇప్పుడు సీఎం జగన్‌ ను చూస్తుంటే ప్రత్యక్షంగా అర్థం అవుతుందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ విధానం మారకపోతే పోరాటానికి దిగుతామని లోకేష్‌ హెచ్చరించారు.

మూడు నెలల్లోనే దారి తప్పిన బండిలా ప్రభుత్వం వెళ్తోందని విమర్శించారు. తుగ్లక్‌ పాలనలో అందరూ ఇబ్బందులు పడుతున్నారని నారా లోకేష్‌ అన్నారు. ఇదే సమయంలో అన్న క్యాంటీన్ లను మూసివేసిన ఏపీ ప్రభుత్వ తీరుని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు నారా లోకేష్.

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పేదలకు భోజనాలు ఏర్పాటు చేయగా కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్ స్వయంగా వారికి అన్నం వడ్డించారు. అనంతరం అయ్యన్నపాత్రుడు పుట్టినరోజు సందర్భంగా వాహనదారుకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పిస్తూ.. 1500 హెల్మెట్లను పంపిణీ చేశారు నారా లోకేష్.