టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ కు ప్రమాదం తప్పింది. ఒక డ్రోన్ పై నుంచి కింద పడిపోయింది. విద్యుత్ తీగలను తగిలి డ్రోన్ కింద పడింది. లోకేష్ కు సమీపంలోనే డ్రోన్ కూలింది. మంగళగిరి నుంచి బస్సులో అసెంబ్లీకి వచ్చిన లోకేష్.. బస్సు నుంచి కిందకు దిగుతున్నారు. అదే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. లోకేష్ కు సమీపంలోనే డ్రోన్ పడింది. లోకేష్ తో పాటు పలువురు ఎమ్మెల్సీలు ఉన్నారు.
అయితే ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. బస్సు దిగిన లోకేష్ అసెంబ్లీకి నడుచుకుంటూ వెళ్లారు. డ్రోన్ పడిపోవడానికి ఆపరేటింగ్ లోపమే కారణం అని తెలుస్తోంది.
ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలను పెంచడాన్ని నిరసిస్తూ లోకేష్ మంగళగిరి నుంచి సిటీ బస్ లో అసెంబ్లీకి వచ్చారు. ఎన్నికల సమయంలో ఏ ధరలూ పెంచమని చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చాక నరకం చూపిస్తున్నారని మండిపడ్డారు. రూ.10 బస్ టికెట్ ను రూ.15కు పెంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతి ఒక్కరిపై 50శాతం భారం వేశారని వాపోయారు. చార్జీలు ఎందుకు పెంచారో ప్రభుత్వం చెప్పలేకపోతోందన్నారు. పెంచిన ఆర్టీసీ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ చార్జీల పెంపుపై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తామన్నారు.