సినిమా నటుడు, జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్‌పై విమర్శలు కురిపించారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఆయనొక రాజకీయ స్థిరత్వం లేని వ్యక్తి అని, మాట మీద నిలబడేవాడు కాదని ఆరోపించారు. విజయవాడలోని భవానీపురం 28వ డివిజన్‌లో మున్సిపల్ అధికారులతో కలిసి పర్యటించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పలుకీలక వాఖ్యలు చేశారు.
నగర అభివృద్ధే ద్యేయంగా రూ.కోటి 40 లక్షల రూపాయలతో బైపాస్ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ పనులతో పాటు డ్రైనేజీ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల తొలిరోజే సినిమా షూటింగ్‌లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. అది నోరా లేక తాటిమట్టా అని తిట్టిపోశారు.
తాను పవన్ కామెంట్లను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. గత ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లోనూ ఓటమి చవిచూసినా ఇంకా బుద్ధి రాలేదంటూ విమర్శలు గుప్పించారు. పవన్ పగలంతా సినిమా షూటింగ్‌లో పాల్గొని సాయంత్రం చంద్రబాబుతో మీటింగ్‌లు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. బాబు డైరక్షన్‌తో పాటు బీజేపీ ముసుగులో పవన్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆపాలని చూస్తే మాత్రం సహించేది లేదంటూ హెచ్చరించారు. అభివృద్ధిని ఆపాలని చూస్తే ఏపీలో ఎక్కడా తిరగలేవని, సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలే సరైన బుద్ధి చెబుతారన్నారు.