రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలకు మద్దతుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. అయితే రైతుల కోసం కృష్ణాయపాలెం, మందడం మధ్య పవన్ కళ్యాణ్‌ని అడ్డుకున్నారు పోలీసులు. అయితే బారికేడ్లు, రోప్‌లను తొలగించుకుని పాదయాత్రగా వెళ్లారు పవన్ కళ్యాణ్. పోలీసులు మందడం వైపు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు.
అయితే అందుకు ఒప్పుకోలేదు పవన్ కళ్యాణ్. ర్యాలీగా ఆయన బారికేట్లు దాటుకుని వెళ్లారు. ఈ సంధర్భంగా పోలీసులకు, జనసేన కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. బారికేడ్లను తొలగించి, దేనికైనా సిద్ధమే అంటూ పవన్ కళ్యాణ్ పోలీసులను దాటుకుని వెళ్లారు. మందడం వెళ్లేందుకు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు పోలీసులు. కృష్ణాయపాలెంలో మాట్లాడిన అనంతరం పవన్ కళ్యాణ్ పాదయాత్రగా మందడం వైపు వెళ్లారు.
పోలీసులు అడ్డుకోవడంపై మాట్లాడారు పవన్ కళ్యాణ్. ముందే మేము ఎలా వెళ్తామనే విషయం చెప్పాం.. అయినా కూడా అడ్డుకున్నారు అంటే వారు ఒత్తిడిలో ఉన్నారేమో అని అన్నారు. ప్రభుత్వం మోసం చేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. ఒక నగరాన్ని రాత్రికి రాత్రి నిర్మించలేరని.. ఒక నగర నిర్మాణం కొన్ని దశాబ్దాలు పడుతుందన్నారు పవన్ కళ్యాణ్.