రాయల సీమ రైతాంగం సమస్యలు తెలుసుకునేందుకు రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ‘జనసేన ఆత్మీయ యాత్ర’ పేరుతో సీమ సమస్యలపై రైతాంగం, మేధావులతో చర్చించేందుకు జనసేనాని సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగానే, కడప జిల్లా రైతాంగం ఎదురుకుంటున్న సమస్యలపై చర్చించబోతున్నారు.
రాష్ట్రంలో ఉల్లి, టమోటా, పత్తి రైతుల కష్టాలు తెలుసుకునేందుకు రైల్వే కోడూరు వెళ్తున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. రైతులు పడుతున్న కష్టాలను నేరుగా తెలుసుకుని వారి సమస్యలపై స్పందిస్తానని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ నుంచి రేణిగుంటకు చేరుకుని మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్, అక్కడి నుంచి భారీ కాన్వాయ్‌తో రైల్వేకోడూరుకు బయలుదేరారు.
అక్కడ జనసేన కార్యకర్త శివప్రసాద్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించనున్నారు. అనంతరం రైల్వే కోడూరులో బహిరంగసభలో పాల్గొననున్నారు. సభ అనంతరం ఇవాళ తిరుపతిలో పవన్ బస చేస్తారు. తిరిగి సోమవారం తిరుపతిలో పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.