చివరి క్షణంలో జగన్‌కు షాక్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే

  • Publish Date - March 24, 2019 / 04:47 AM IST

వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకుని చివరి క్షణంలో నిర్ణయాన్ని విరమించుకున్నారు. తెలుగుదేశం టిక్కెట్ దక్కకపోవడంతో పార్టీకి రాజీనామా చేసిన తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో పార్టీ కండువా కప్పకునేందుకు జగన్ బహిరంగ సభకు వచ్చిన పులపర్తి నారాయణ మూర్తి జగన్‌ ప్రసంగం ముగిశాక బస్సు ఎక్కారు. జగన్.. పార్టీ కండువా కప్పుతుండగా కప్పుకునేందుకు నిరాకరించారు.

దీంతో జగన్ ఒక్కసారిగా షాక్ అవ్వగా… మరోసారి కప్పేందుకు ప్రయత్నించారు. అయితే అందుకు కూడా నిరాకరించడంతో తన చేతిలో ఉన్న కండువాను పక్కనున్న నేత చేతిలో పెట్టి పులపర్తిని పంపేయాలని అన్నారు. అనంతరం ప్రజలకు అభివాదం చేసి బస్సు దిగిన పులపర్తి.. తిరిగి వెళ్లిపోతూ మీడియాతో మాట్లాడారు. కొన్ని కారణాల వల్ల వైసీపీలో చేరలేదని, అక్కడ ప్రవర్తన, నియమాలు చూసి చేరకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

చంద్రబాబు తనకు చేసిన అన్యాయం పెద్దదేం కాదని, కొందరు వైసీపీ నాయకులు తనను బలవంతంగా పిఠాపురం తీసుకెళ్లారని, వైసీపీలో చేరితే ఉన్నత పదవి ఇస్తానని హామీ ఇచ్చి తర్వాత మాట తప్పినట్లు తెలిపారు. ఇక టీడీపీలోనే కొనసాగుతానంటూ స్పష్టం చేశారు.