పోలవరం ఆపేస్తారు: కేసీఆర్ నీరు పోస్తారు

  • Publish Date - April 7, 2019 / 04:50 AM IST

ఆంధ్రప్రదేశ్‌కు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయంటూ చెప్పిన ప్రముఖ సినీ నటుడు శివాజీ..  పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల వీడియోను చూపిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగానే ఏపీలో సీఎస్‌ను మార్చారని, ఏపీ సీఎస్‌ను మార్చడం కంటే దారుణం ఇంకేం ఉంటుందని ప్రశ్నించారు.

ఈ సమయంలో ప్రజలు సరైన నిర్ణయం తీసుకోకుంటే కేసీఆర్ దీనిని ఆపివేయడం ఖాయమని అన్నారు. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదని, కేసీఆర్ ఎట్టిపరిస్థితుల్లోనూ పోలవరంను ఆపి తీరుతారని స్పష్టం చేశారు. తనకు అనుకూలంగా వచ్చే వారి కోసం కేసీఆర్ ఎంతైనా ఖర్చు చేస్తారని, ఈ మహాయజ్ఞంలో కేసీఆర్ నీరు పోస్తారని సంచలన ఆరోపణలు చేశారు.

పక్కరాష్ట్రంలోని కొంతమంది సన్నాసులు ఏపీపై పగబట్టారని వారి ఎత్తులను చిత్తు చేయాలని శివాజీ కోరారు. వారి కుట్రలను బద్దలుగొట్టకపోతే మీ కుటుంబాలకు అన్యాయం చేసుకున్నవారు అవుతారని శివాజీ హెచ్చరించారు. రాబోయే తరాలకు అన్యాయం చేసిన వారు అవుతారని అన్నారు. ఆ దారుణాన్ని ఆపాలని, సరైన నేతను ఎంచుకోవాలని శివాజీ అన్నారు.