మొక్కలు ధ్వంసం చేసినందుకు బాలయ్యకు రూ.30వేలు ఫైన్  

  • Publish Date - October 2, 2019 / 07:26 AM IST

హరితహారం మొక్కల్ని పాడు చేస్తే జేబు ఖాళి అవుతుందని తెలంగాణ ప్రభుత్వం మరోసారి నిరూపించింది. హరితకారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కల్ని ధ్వంసం చేసినందుకు తెలుజూరు బాలయ్య అనే వ్యక్తికి ప్రభుత్వ అధికారులు రూ.30వేలు ఫైన్ వేశారు. అంతేకాదు అతనితో మొక్కలు నాటించి వాటిని సంరక్షించాలని లేకుండా మరోసారి ఫైన్ వేస్తామని హెచ్చరించాడు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో జరిగింది. 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాతకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తోంది. ప్రతీ సంవత్సరం వర్షాకాలంలో హరితహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించి పలు మొక్కలు నాటుతున్నారు. ప్రతీ ఏటా కోటికి పైగా రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటాలని..వాటిని సంరక్షించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

ఈ క్రమంలో సిద్దిపేట పట్టణంలోని మిలన్ గార్డెన్ రోడ్డులో బృందావన కాలనీ ఎదురుగా ఉన్న 30చెట్లను తెలుజూరు బాలయ్య ధ్వంసం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్ బర్ల మల్లికార్జున్‌తో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆగ్రహం వ్యక్తంచేస్తూ..హరితహారం మొక్కల్ని నరికిన  బాలయ్యకు సిద్దిపేట మున్సిపల్ అధికారులు రూ.30వేల జరిమానా విధించారు.  అతనితో 30చెట్లు నాటించి, సంవత్సర కాలం వరకు ఆ మొక్కల సంరక్షణ బాధ్యతను అప్పగించారు.