జైల్లో నన్ను చంపేందుకు కుట్ర: జగన్‌పై దాడి కేసు నిందితుడు శ్రీనివాస్ సంచలన ఆరోపణలు

  • Publish Date - September 6, 2019 / 05:52 AM IST

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత..ప్రస్తుత ఏపీ సీఎం జగన్ పై దాడి కేసు నిందితుడు శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశాడు.  రాజమండ్రి సెంట్రల్ జైలులో తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని శ్రీనివాస్ ఆరోపించాడు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్న శ్రీనివాస్ తనపై జైలర్, జైలు వార్డెన్ దాడి చేశారనీ..చిత్ర హింసలకు గురిచేస్తున్నారనీ ఫోన్ ద్వారా తన కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో వారు ఆందోళన వ్యక్తంచేశారు. అనంతరం ఈ విషయాన్ని శ్రీనివాస్ కేసు వాదిస్తున్న లాయర్ అబ్దుల్ సలీం దృష్టికి తీసుకొచ్చారు.  

ఈ సందర్భంగా లాయర్ సలీం మాట్లాడుతూ..శ్రీనివాస్ ను జైలులోనే అంతంచేసేందుకు అధికారులు కుట్ర పన్నుతున్నారని..అతని భద్రతపై కోర్టులో పిటీషన్ వేస్తామని తెలిపారు. జైలులో జరిగిన దాడిలో శ్రీనివాస్ కు గాయాలయ్యాయనీ.. దీనిపై జైలు అధికారులపై సెక్షన్ 307 కింద కేసులు పెడతామని..శ్రీనివాస్ కు రాజమండ్రి జైల్లో భద్రత లేదనీ..విశాఖ జైలుకు బదిలీ చేయాలని కోర్టును కోరతామని సలీమ్ తెలిపారు. 

కాగా..ప్రస్తుతం ఏపీ సీఎంగా ఉన్న జగన్ పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో 2018 అక్టోబర్ 25  జానిపల్లి శ్రీనివాస్ కోడిపందేలకు వాడే కత్తితో  దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. పాదయాత్ర లో ఉన్న జగన్ విశాఖ నుంచి హైదరాబాద్ వచ్చేందుకు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. వీఐపీ లాంచ్ లో ఉన్న జగన్ పై ఎయిర్ పోర్ట్ క్యాంటిన్ లో పనిచేస్తున్న శ్రీనివాస్ అన్నా అంటు వచ్చి సెల్ఫీ కావాలని అడిగి కోడి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో  జగన్ భుజానికి గాయమైంది.ఈ కేసు అప్పట్లో పెను సంచలనం కలిగింది. ఈ కేసు ఇప్పటికే పలు మలుపులు తిరిగిన క్రమంలో రాజమండ్రి జైలులో ఉన్న శ్రీనివాస్ చేసిన ఈ ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి.