ముఖ్యమంత్రిగా ఉండే అర్హత కేసీఆర్ కు లేదు : విజయశాంతి

  • Publish Date - April 25, 2019 / 09:21 AM IST

ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నామని.. కానీ ప్రజలు, విద్యార్థుల ఆశలు అడియాశలయ్యాయని కాంగ్రెస్ నాయకులు విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగితే విచారణ కమిటీ, రీ వాల్యుయేషన్, ఫ్రీ రీ వెరిఫికేషన్ అంటూ సీఎం కేసీఆర్ చేతులు దులుపేసుకుంటున్నారని ఆమె విమర్శించారు. చనిపోయిన విద్యార్థులకు సంబంధించి కేసీఆర్ ఏమీ మాట్లాడటం లేదన్నారు. వారి తల్లిదండ్రులకు ఏమీ న్యాయం చేయలేదన్నారు. దొరల పరిపాలన ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు. పేదల కష్టాలు దొరలకు ఏం తెలుసునని ప్రశ్నించారు. అట్టడుగు ప్రజల కష్టాలు కేసీఆర్ కు ఏం తెలుసునని నిలదీశారు. కేసీఆర్ కు అడ్మిస్ట్రేషన్ రాదని..ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఆయనకు లేదని విమర్శించారు. సీఎం పదవి నుంచి కేసీఆర్ దిగిపోవాలని డిమాండ్ చేశారు.

తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివించుకున్నారని.. ఇప్పుడు వారికి ఏం సమాధానం చెబుతారని అడిగారు. సీఎం ఐదు రోజుల నుంచి స్పందించలేదని.. ఏసీ రూమ్ లలో కూర్చున్నారని మండిపడ్డారు. ఇంతవరకు కేసీఆర్ వారికి భరోసా ఇవ్వలేదన్నారు. విచారణ కమిటీ, రీ వాల్యుయేషన్, ఫ్రీ అని వెళ్లిపోయారని తెలిపారు. చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రుల తరపు నుంచి తాము మాట్లాడుతున్నామని చెప్పారు. చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఏ రకంగా న్యాయం చేస్తారో చెప్పాలన్నారు. 

గ్లోబరీనా సంస్థ బ్లాక్ లిస్టులో ఉందని.. ఆ సంస్థపై కేసులు ఉన్నాయని అయినా దానికే అప్పగించారని ఎందుకంటే.. కేటీఆర్, గ్లోబరీనా సంస్థ నిర్వహకుడు ఫ్రెండ్స్ కాబట్టి ఆ సంస్థకే అప్పగించారని ఆరోపించారు. డబ్బుల కక్కుర్తి కోసం ఇంతమందిని చంపేందుకు పూనుకున్నారని మండిపడ్డారు. గ్లోబరీనా సంస్థ నిర్వహకుడిని అరెస్టు చేయాలని, విద్యాశాఖ మంత్రిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని, ఆ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు, విద్యార్థుల మరణాలకు కారణమైన గ్లోబరీనా సంస్థ నిర్వహకులను అరెస్టు చేయాలన్నారు. నిజాలు  బట్టబయలు కావాలన్నారు. 

చనిపోయిన తర్వాత కమిటీ వేస్తారా అని ప్రశ్నించారు. ముందే జాగ్రత్తలు తీసుకుంటే విద్యార్థులు చనిపోయేవారు కదన్నారు. మీ ఇంట్లో వారు చనిపోతే ఇలానే చేస్తావా అని కేసీఆర్ ను ఆమె నిలదీశారు. దొరల పాలన ఇలానే ఉంటుంది..కనుక దొరల పరిపాలన వద్దని చెబుతున్నానని తెలిపారు. కేసీఆర్ పరిపాలనంతా అవకతవకలు, మోసాలు, కుట్రలమయం అన్నారు. కాంగ్రెస్ లేకుండా చేయాలనే పని మాత్రం చాలా సిన్సియర్ గా చేస్తున్నాడని మండిపడ్డారు. ఒక్కో ఎమ్మెల్యేను 30 కోట్లు ఇచ్చి కొందామా, కాంగ్రెస్ ను లేకుండా చేద్దామని కేసీఆర్ ఆలోచన తప్పా… విద్యార్థుల గురించి మాట్లాడుంటే ఇలా జరిగేది కాదని.. వారు బతికే వారన్నారు. 

కేసీఆర్ కు పరిపాలించడం రాదు..కానీ ఎమ్మెల్యేలను, ఎంపీలు కొనడం మాత్రం వస్తుందన్నారు. సీఎం కుర్చీలో కూర్చోవడమే ఆయనకు కావాలి.. తెలంగాణ డెవలప్ మెంట్ అనేది లేదన్నారు. మీడియాను పెట్టుకుని రెండు ముక్కలు చెబుతారని… ఆయనకు తలొగ్గి మీడియా ఎస్ బాస్ అంటుందని, వినకపోతే మిమ్మల్ని తీసుకెళ్లి లోపల పెడతారని, ఛానెల్ ను బ్యాన్ చేస్తారని తెలిపారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను మీడియాలో చూపించడం లేదన్నారు. కేసీఆర్ ను సీఎం పదవి నుంచి తొలగిస్తే రాష్ట్రం బాగుపడుతుందన్నారు.