మచిలీపట్నంలో దారుణం….భర్తపై పెట్రోల్ పోసి తగల పెట్టిన భార్య

  • Publish Date - October 30, 2020 / 01:45 PM IST

wife kills husband, due to family dispute : కృష్ణాజిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపధ్యంలో భర్తపై, భార్య పెట్రోల్ పోసి తగల బెట్టింది. ఇనకుదురు పేట పోలీసు స్టేషన్ కు కూతవేటు దూరంలో ఈ దారుణం జరిగింది. మచిలీపట్నం మార్కెట్ యార్డు కమిటి చైర్మన్ అచ్చాబా కుమారుడు ఎస్.కే. ఖాదర్ బాషాపై పెద్ద భార్య గురువారం రాత్రి పెట్రోల్ పోసి నిప్పంటించింది.

50 శాతం కాలిన గాయాలతో ఉన్న ఖాదర్ భాషా రాత్రి గం.1-30 సమయంలో జిల్లా ఆస్పత్రిలో చేరాడు. మెరుగైన వైద్యం కోసం ఆయన్ను విజయవాడ తరలించగా… ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలిసింది.


ఖాదర్ భాషాకు ఇద్దరు భార్యలు. భార్యలిద్దరూ అక్క చెల్లెళ్లు. మొదట అక్కను పెళ్లి చేసుకోగా….. రెండు నెలల క్రితం ఆమె చెల్లెల్ని బాషా రెండో పెళ్లి చేసుకున్నాడు. తన దగ్గరకంటే తన చెల్లెలి వద్దే ఎక్కువ కాలం బాషా గడుపుతూ ఉండటంతో మొదటి భార్య, భర్తతో తరచూ గొడవ పడుతూ ఉండేది.


ఈ నేపధ్యంలో గురువారం రాత్రి భార్యా భర్తల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవల్లో మొదటి భార్య బాషాపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. వెంటనే ఆయన జిల్లా ఆస్పత్రిలో చేరారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కొసం అతడ్ని రాత్రే విజయవాడలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న బాషా ఆరోగ్యం విషమించినట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న ఇనకుదురుపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.