హంగ్ వచ్చే అవకాశం లేదు : ఓటు వేసిన జగన్
- veegam team
- Published On : April 11, 2019 / 02:25 AM IST
కడప : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రజా తీర్పు చాలా స్పష్టంగా ఉంటుందని, హంగ్ వచ్చే అవకాశమే లేదని వైసీపీ చీఫ్ జగన్ అన్నారు. పులివెందులలో జగన్, ఆయన భార్య భారతి గురువారం(ఏప్రిల్ 11,2019) ఉదయం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వజ్రాయుధం అన్న జగన్.. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. నిర్భయంగా ఓటు వేయాలని, మార్పు కోసం ఓటు వేయాలని జగన్ అన్నారు.
ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమై పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. సాయంత్రం 5 గంటలలోపు పోలింగ్ కేంద్రాల్లో క్యూలో ఉన్న ఓటర్లంతా ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఈసీ అనుమతిచ్చింది. గురువారం(ఏప్రిల్ 11,2019) 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల బరిలో 2వేల 118 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. లోక్‌సభ బరిలో 319 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.
ఏపీలో 3 కోట్ల 93 లక్షల 45 వేల 717 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో కోటి 94 లక్షల 62వేల 339 మంది పురుష ఓటర్లుకాగా… కోటి 98 లక్షల 79వేల 421 మంది మహిళా ఓటర్లు. టాన్స్ జెండర్లు మరో 3వేల 957 మంది ఉన్నారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 42 లక్షల 4వేల 436 మంది ఓటర్లు ఉండగా… అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 18 లక్షల 18వేల 113 మంది ఉన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 46వేల 120 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 8 వేల 154 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించింది.
