బాలకృష్ణను చూసి సిగ్గు తెచ్చుకో పవన్ కళ్యాణ్: గుడివాడ అమర్‌నాథ్

  • Publish Date - November 4, 2019 / 02:06 AM IST

ఇసుక కొరతపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ మండిపడ్డారు. ఇసుక కొరత లేదని తాము ఎక్కడా చెప్పలేదని.. కానీ ఇసుక కృత్రిమ కొరత సృష్టించామని ప్రతిపక్షాలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని అభిప్రాయపడ్డారు అమర్ నాథ్. వరదల సమయంలో ఇసుక తీయడం ఎంత కష్టమో ప్రజలకు తెలుసని అన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే పేరు మార్చుకుంటా అన్నావ్. అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అయ్యింది. పేరు మార్చుకున్నావా? అంటూ ఎద్దేవా చేశారు గుడివాడ అమర్‌నాథ్‌.

దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు గత ఐదేళ్లుగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్నారని, తెలుగుదేశంకు వత్తాసు పలికిన జనసేన అధినేత ఇప్పుడు బయటకు వచ్చి నీతులు చెబుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ర్యాలీ గాజువాకలో చేసి ఉంటే ప్రజలు ఎందుకు ఓట్లు వెయ్యలేదో తెలిసేదని అన్నారు. విశాఖలో సభ పెట్టి మంత్రులను విజయసాయి రెడ్డి, బొత్స సత్యనారాయణ, కన్నబాబులను తిట్టడానికి వచ్చారా? అని ప్రశ్నించారు.

కోట్ల రూపాయల డబ్బులు వచ్చే సినిమాలను వదిలేసుకుని వచ్చాను అంటున్నావు. రెమ్యునరేషన్ తీసుకుని ప్రొడ్యూసర్లు నీ కోసం తిరుగుతుంటే వాళ్లకు డేట్లు ఇచ్చి పట్టించుకోలేదని ఆ విషయాల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదని మాట్లాడట్లేదని అన్నారు అమర్ నాథ్. ఇదే సమయంలో బాలకృష్ణ కనీసం రెండు సార్లు అయినా గెలిచాడని, పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారని బాలకృష్ణను చూసి సిగ్గు తెచ్చుకోవాలని అమర్ నాథ్ అన్నారు.