ఒక మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు ఎప్పటికి తోడుగా ఉండేది ఒక్క స్నేహమే అనే మాటకి ఈ ఘటనే నిదర్శనం. కేరళలోని తురవూర్ లోని శ్రీ గోకులం SNGM క్యాటరింగ్ కాలేజ్ లో చదువుతున్న కేఎస్ అర్మోల్ అనే విద్యార్థిని సోదరి ఐశ్వర్య (23) ఎప్పటినుంచో కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. ఆమె ప్రాణాలతో ఉండాలంటే కిడ్నీ ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు.
ఈ విషయం తెలుసుకున్న తన ఫ్రెండ్స్.. ఎలా అయినా ఆమె వైద్యానికి అయ్యే ఖర్చులను సంపాదించాలని నిర్ణయించుకున్నారు. మొత్తం 32 మంది విద్యార్థులు కలిసి నేషనల్ హైవే పక్కనే ఫుడ్‌స్టాల్ ప్రారంభించారు. ఇక ఆ ఫుడ్ స్టాల్ ద్వారా వచ్చే డబ్బును అర్మోల్ కుటుంబానికి అందించారు. రోజుకు కనీసం 4 వేల నుంచి రూ.5 వేల వరకు ఆదాయం వస్తోందని.. వాటి ద్వారా ఆమె ఆపరేషన్ జరిపిస్తామని అశ్విన్ అనే విద్యార్థి తెలిపాడు.
అర్మోల్ మాట్లాడుతూ.. మా సోదరి ఐశ్వర్య కిడ్నీ మార్పిడి చికిత్స కోసం రూ.20 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. అయితే ఐశ్వర్యకు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. తర్వాత ఎర్నాకులంలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్చుతాం. దీనికి మా ఫ్రెండ్స్ చేస్తున్న ఈ సాయం చాలా గొప్పది. ఈ ఫుడ్ స్టాల్ నుంచి వచ్చే ఆదాయం తప్పకుండా నా సోదరిని కాపాడుతోందని తెలిపింది.