డబ్బులు మోదీ వేస్తున్నాడనుకున్నా..ఇద్దరు కస్టమర్లకు ఒకే బ్యాంక్ అకౌంట్

  • Publish Date - November 23, 2019 / 05:15 AM IST

బ్యాంకు అధికారులు చేసిన తప్పు వల్ల ఎంతపని జరిగిందో చూడండి. సాధారణంగా బ్యాంకుల్లో జాయింట్ అకౌంట్లు ఉంటాయని అందరికి తెలుసే ఉంటుంది. కానీ ఇద్దరు సంబంధం లేని వ్యక్తులకు కూడా ఒకే అకౌంట్ ఉంటుందా? అవును మధ్యప్రదేశ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

మధ్యప్రదేశ్‌లోని రోని గ్రామానికి చెందిన హుకుం సింగ్ అనే వ్యక్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో అకౌంట్ ఓపెన్ చేశాడు. ఆ అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుంచి అతనికి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. అదేంటని ఆలోచించకుండా.. నరేంద్ర మోదీ చెప్పిన మాట నిలబెట్టుకున్నాడని… నల్లడబ్బు ఇండియాకు తీసుకొచ్చి ఇలా అకౌంట్లలో నెలా నెలా వేస్తున్నారని భావించాడు.

దీంతో ఆ డబ్బును కర్చు చేయడం మొదలుపెట్టాడు. గత ఆరు నెలల్లో మొత్తం రూ.89 వేలు డ్రా చేశాడు. అయితే ఆ డబ్బు వేసే వ్యక్తి.. ఓ రోజు తన అకౌంట్లో డబ్బులు ఎంత ఉన్నాయో చెక్ చేసుకుందామని చూస్తే.. లక్షా నలబై వేలు ఉండాల్సిన అకౌంట్లో కేవలం 35వేల 400 మాత్రమే ఉన్నాయని తెలుసుకున్నాడు. దీంతో బ్యాంక్ అధికారులు అతడి వివరాలు పరిశీలించారు.

అసలు విషయం ఏంటంటే.. ఆ ఫిర్యాదు చేసిన వ్యక్తి పేరు, డబ్బులు డ్రా చేసుకునే వ్యక్తి పేరు హుకుమ్ సింగ్ కావడం, అతడు నివసిస్తున్న గ్రామం పేరు కూడా రోని గ్రామం పేరుకు దగ్గరగా ఉండటం, ఇద్దరి వివరాలు దాదాపు ఒకేలా ఉండటం వల్ల ఇద్దరికీ ఒకే బ్యాంకు అకౌంటును కేటాయించినట్లు తెలుసుకున్నారు. దీంతో వెంటనే తప్పు జరిగిందని తెలుసుకుని అధికారులు తలలు పట్టుకున్నారు.  మరి, వీరి సమస్య ఎలా పరిష్కరం అవుతుందో చూడాలి.