డ్రోన్‌తో పాన్‌మసాలా డెలివరీ.. గుజరాతీయుల అతితెలివి

  • Publish Date - April 27, 2020 / 09:38 AM IST

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. నిత్యావసర వస్తువుల సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇతర వస్తు సేవలన్నీ నిలిచిపోయాయి. కరోనావైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజలంతా సాధ్యమైనంతవరకు భౌతిక దూరాన్ని పాటించాలని ఖచ్చితంగా అవసరమైనప్పుడు మాత్రమే బయటకు రావాలని అధికారులు ఆదేశించారు. 

అయినప్పటికీ, కొంతమందికి అలవాట్ల కారణంగా బయటకు వస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమిస్తున్నారు. ఎన్నో ఏళ్లనుంచి ఉన్న అలవాట్లను ఒక్కసారిగా వదిలేసుకోలేక చాలామంది తమ కోరుకున్న వస్తువుల కోసం ఆరాటపడిపోతున్నారు. మద్యానికి అలవాటు పడినవారు మద్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొందరు మద్యం దొరక్క ఆత్మహత్యకు కూడా పాల్పడిన ఘటనలు ఉన్నాయి. 

 

గుజరాత్ లోని మోర్బి ప్రాంతం నుండి పాన్ మసాలాను ఇళ్లకు డెలివరీ చేయడానికి డ్రోన్ వినియోగించిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రజలు తమ అలవాట్లను మానుకోలేక డ్రోన్ సాయంతో తమ కోరికలను తీర్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేయడంతో వైరల్ అయింది. ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో అప్రమత్తమయ్యారు. 

ఓ నివేదిక ప్రకారం.. ప్రజల ఇళ్లకు పాన్ మసాలా పంపిణీ చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. మద్యం, సిగరెట్లను బ్లాకులో అమ్మడం ద్వారా ఎలా డబ్బు సంపాదిస్తున్నారో కూడా నివేదికలో పేర్కొంది. ప్రతిఒక్కరూ తమ చెడు అలవాట్లను వదిలించుకోవడానికి, అనారోగ్యాన్ని కలిగించే పదార్థాలపై మన ఆధారపడటాన్ని తగ్గించడానికి ఈ లాక్ డౌన్ ఒక్కటే సరైన సమయమని అందరూ గుర్తించాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు.