కరోనా మహమ్మారి రోజురోజుకీ విజృంభిస్తుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ చర్యలు ముమ్మరం చేశాయి. అకారణంగా రోడ్లపైకి వస్తున్నవారిని కట్టడి చేయడానికిక పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి వారిని కట్టడి చేయడానికి మిమిక్రీ భవిరి రవి చేసిన ‘శివమణి’ డైలాగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కింగ్ నాగార్జున నటించిన ‘శివమణి’ సినిమాలోని డైలాగులను కరోనా సంబంధిత మాటలుగా మార్చిన ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు నాగ్. ‘నేను ఇప్పడు శివమణి సినిమా చేస్తే కరోనా సంక్షోభంలో పూరి జగన్నాథ్ రాసే డైలాగులు ఇలా ఉంటాయి’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోలో నాగార్జున మాటలను భవిరి రవి కరోనా నేపథ్యంలో సాగే డైలాగులుగా వినిపించాడు.
2003లో వచ్చిన ‘శివమణి’ సినిమాలో పోలీస్ పాత్రలో నాగ్ పూర్ణా మార్కెట్ సర్కిల్ Inspector గా వచ్చినప్పుడు స్థానిక రౌడీషీటర్లకు వార్నింగ్ ఇస్తాడు. అయితే ఈ మాటలను తొలగించి కరోనాకు మాస్కులు పెట్టుకోమంటే ఎందుకు వినిపించుకోవడం లేదని రౌడీలను హెచ్చరిస్తున్నట్లు భవిరి రవి ఎడిట్ చేశారు. ‘నా పేరు శివమణి.. నాకు కొంచెం మెంటల్.. ఇప్పటివరకు మాస్కులు లేకుండా ఎందుకు తిరిగారో నేను అడగా.. సడన్‌గా కరోనా వచ్చింది మాస్కులు వేసుకోండి అంటే కష్టంగానే ఉంటది’ అంటూ నాగార్జున రౌడీలకు ఇస్తున్న వార్నింగ్ వీడియో సోషల్ మీడియలో ట్రెండ్ అవుతోంది.