కరోనా వైరస్ కారణంగా ప్రపంచం స్తంబించిపోయింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా రోజురోజుకీ పాజిటివ్ మరియు మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. నిత్యావసర వస్తువులు కోసం తప్ప ఎవరూ బయటకి రావడం లేదు. ఇక మందు బాబుల పరిస్థితి మాత్రం వర్ణనాతీతం.. ముందుగా తెలిస్తే స్టాక్ పెట్టుకునే వాళ్లం కదా అని ఆవేదన చెందుతున్నారు.
కొందరు గజ తాగుబోతులైతే బ్రాండ్ ఏదైనా పర్లేదు గుక్కెడు బ్రాందీ దొరికితే చాలు అనుకుంటున్నారు. పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ హైదరాబాద్ ఎర్రగడ్డ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. కొంతమంది అయితే ఈ పరిస్థితిలో డబ్బులున్నోడికంటే మందు స్టాక్ ఉన్నోడే గొప్ప అన్నట్టు ఫీలయిపోతున్నారు. వారి బాధ అర్థం చేసుకున్న కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ అఖిల భారత తాగుబోతుల తరపున తెలుగు రాష్ట్రాల సీఎంలకు విజ్ఞప్తి చేశారు.
‘మందు దొరక్క తాగుబోతు సోదరులు జుట్టు పీక్కుంటున్నారు. పసి పిల్లల్లా గుక్కపెట్టి ఏడుస్తున్నారు. పిచ్చాసుపత్రుల ముందు క్యూ కడుతున్నారు. ఫస్ట్రేషన్‌లో పెళ్లాలను చితకబాదుతున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలా పెద్దమనసు చేసుకుని ఆలోచించండి’.. అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌లకు విన్నవిస్తూ వారితో పాటుగా కేటీఆర్‌ను ట్యాగ్ చేశారు. ఇటీవల రిషి కపూర్ ‘రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ నుండి డబ్బు అవసరం. అందుకోసం కొంత కాలం లైసెన్స్ పొందిన మద్యం దుకాణాలని సాయంత్రం సమయంలో తెరవాలి’.. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నెటిజన్ల చేత తిట్లు తిన్నారు.