స్విగ్గీ గో: ఫుడ్ ఒక్కటే కాదు.. ఏదైనా డెలివరీ

ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ఓ కొత్త సర్వీసును లాంచ్ చేసింది. బుధవారం స్విగ్గీ గో అనే సర్వీస్‌ను బెంగళూరులో లాంచ్ చేస్తూ గుడ్ న్యూస్ చెప్పింది. 2020వ సంవత్సరం నాటికి 300 సిటీల్లో ఈ సర్వీస్‌ను విస్తరించునున్నారు. సిటీ మొత్తంలో ఎక్కడికైనా పంపాలనుకున్న, ఇవ్వాలనుకున్న వస్తువులను స్విగ్గీ ద్వారా బుక్ చేసుకుని పంపొచ్చు. 

ఇదే ఈ సర్వీస్ యొక్క ముఖ్య ఉద్దేశం. యాప్‌లో ఉండే స్విగ్గీ స్టోర్స్, స్విగ్గీ గో యాప్‌ల ద్వారా ఈ బుకింగ్‌లు చేసుకోవచ్చు. లాండ్రీకి ఇవ్వాల్సిన దుస్తులు, ఇంట్లో మరచిపోయి వచ్చిన తాళం చేతులు, లంచ్ బాక్సులు, డాక్యుమెంట్లు ఇలా ఏమైనా పంపేసుకోవచ్చు. వీటిని బెంగళూరుతో పాటు హైదరాబాద్‌లో కూడా విస్తరించే ఆలోచనలో ఉన్నారు. 

నగరవాసుల పనుల్లో ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా ఉండాలని స్విగ్గీ కొత్త సర్వీస్ లాంచ్ చేసినట్లు సీఈఓ శ్రీహర్ష మాజెట్టి తెలిపారు. ఫుడ్‌తో పాటు ఏ వస్తువునైనా డెలీవరీ చేసేందుకు స్విగ్గీ సిద్ధంగా ఉంటుందని, ఈ సర్వీస్ అందించడంలో స్విగ్గీనే తొలి సర్వీస్ అని ఆయన పేర్కొన్నారు. దీని ద్వారా డెలివరీ బాయ్స్‌కు అదనపు ఆదాయం వస్తుందని ఆయన వివరించారు. 2014లో మొదలైన స్విగ్గీ 325 పట్టణాల్లో లక్షా 30వేల రెస్టారెంట్లతో ఒప్పందం కుదుర్చుకుంది.