Senior KG School Fee : UKG స్కూల్ ఫీజు రూ.2.25 లక్షలు.. నెట్టింట ఆసక్తికర చర్చ
Senior KG School Fee : యూకేజీ ఫీజు సంవత్సరానికి రూ.2.25 లక్షలు అనే పోస్ట్ నెట్టింట ఆసక్తికర చర్యలు దారి తీసింది.
- Dharani Pilli
- Published On : March 22, 2026 / 06:35 PM IST
Viral Fee Slip says Rs 2 25 Lakh for Senior KG Sparks Outrage Over Private School Charges
Senior KG School Fee: ఒకప్పుడు చదువు చెప్పడం అంటే దాన్నో పవిత్ర కార్యంగా భావించేవారు. కానీ నేటి కాలంలో చదువు చెప్పడం కూడా వ్యాపారంగానే మారింది. కొత్త కొత్త పేర్లు చెప్పి మరీ తల్లిదండ్రుల వద్ద నుంచి లక్షలు వసూలు చేస్తున్నారు. నర్సరీ వంటి క్లాసులకు రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు వసూలు చేస్తున్నారు. కాస్త పేరు మోసిన స్కూళ్లలో అయితే సీటు దక్కించుకోవాలంటే లక్షల రూపాయలు ఖర్చు చేయాలి. అలానే ప్రతి ఏటా లక్షల్లో ఫీజులు చెల్లించాలి. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫోటో తెగ వైరల్ అవుతోంది. సీనియర్ కేజీ విద్యార్థికి ఓ స్కూల్ యాజమాన్యం సంవత్సరం ఫీజు కింద రూ. 2.25 లక్షలు వసూలు చేస్తున్నట్లు ఆ ఫోటోలో ఉంది. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. అలాగే ప్రైవేట్ పాఠశాలలు ఫీజులు నిర్ణయించే విధానంపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది.
సీనియర్ కేజీలో పిల్లలకు నేర్పేది కేవలం చదవడం, లెక్కలు, సామాజిక నైపుణ్యాలు మాత్రమే. ఆ మాత్రం దానికే పిల్లల నుంచి 2 లక్షలకు పైగా ఫీజు వసూలు చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని “చట్టబద్ధమైన దోపిడీ”గా అభివర్ణిస్తున్నారు. ఈ ఫీజు స్ట్రక్చర్‌పై ఓ యూజర్ స్పందిస్తూ.. “మెట్రో నగరాల్లో ఈ విధమైన బహిరంగ దోపిడీ కొనసాగుతోంది. ఈ ఫీజులు కేవలం టాప్ 1 శాతం మంది మాత్రమే భరించగలరు. మిగతా 99 శాతం ప్రజలు నాణ్యమైన విద్య లేదా రోజువారీ ఖర్చుల మధ్య రాజీ పడాల్సిందే. అయినా సరే ఈ దోపిడీ ఆగదు. ఇవి రాజకీయ నాయకుల చేతుల్లోనే నడుస్తున్నాయి” అంటూ ట్వీట్ చేశారు.
మరో యూజర్ స్పందిస్తూ.. “సీనియర్ కేజీకి సంవత్సరానికి రూ. 2.25 లక్షలు అనేది ఆశ్చర్యంగా అనిపించొచ్చు. కానీ పెద్ద నగరాల్లోని ఇతర ప్రైవేట్ పాఠశాలలతో పోలిస్తే ఇది తక్కువే. ప్రీమియం మెట్రో స్కూల్స్ సాధారణంగా 3 నుంచి 5 లక్షలు లేదా 10 లక్షలకు పైగా కూడా వసూలు చేస్తాయి. అందుకే ఇది ఇప్పుడు తక్కువ ఫీజులానే కనిపిస్తోంది” అని పేర్కొన్నారు.
మరి విద్యార్థి నుంచి వసూలు చేసే ఈ రూ. 2.25 లక్షల్లో దేనికి ఎంతంటే:
స్కూల్ ట్యూషన్ ఫీజు, లైబ్రరీ ఫీజు, జిమ్ ఖానా ఫీజు.. ఇవన్నీ కలిపి సంవత్సరానికి రూ. 2,24,718. ఇవి కాక అదనంగా అడ్మిషన్ ఫీజు రూ. 15 వేలు, కాషన్ మనీ కింద మరో రూ. 33 వేలు వసూలు చేస్తోంది సదరు స్కూల్ యాజమాన్యం.
కొన్ని నెలల క్రితం ఈ అధిక ఫీజు సమస్య ఢిల్లీలో భారీగా చర్చకు దారితీసింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం పాఠశాల ఫీజులను నియంత్రించేందుకు కొత్త చట్టాన్ని తీసుకురావడానికి ముందుకొచ్చింది. స్కూల్ లెవల్ ఫీ రెగ్యులేషన్ కమిటీల (SLFRCs) ఏర్పాటు కోసం మొదటగా జనవరి 10గా నిర్ణయించిన గడువును, తర్వాత ఫిబ్రవరి 2, 2026 వరకు పొడిగించారు. కానీ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో అది ముందుకు సాగలేదు.
