OMG: తాగుబోతు భర్త కోసం ఇంటి వెనుకే బార్ కట్టించిన భార్య

  • Publish Date - December 13, 2019 / 01:33 PM IST

సాధారణంగా తాగుబోతు భర్తలను చూసి భార్యలు చాలా బాధపడుతుంటారు. తాగి ఇంటికి జాగ్రత్తగా వస్తాడో లేదో అని భయపడుతుంటారు. బాగా తాగుబోతులు అయితే రోడ్ల మీద తాగి పడిపోతుంటారు. అయితే ఇదే సమస్య ఓ భార్య కూడా ఎదుర్కొంది. కానీ అందరిలా రోజూ భర్త కోసం ఎదురు చూసే పనిలేకుండా.. ఏకంగా ఇంటి వెనుక బార్ కట్టించేసింది ఈ సతీమణి. ఈ ఘటన నైరుతి ఇంగ్లాండ్‌లోని డెవాన్‌లో చోటుచేసుకుంది.

తన భర్త (పాల్ టప్పర్‌) న్యూటన్ అబ్బాట్ అనే సంస్థలో ఇంజినీర్‌ గా పనిచేస్తున్నాడు. అతనికి పబ్బులకు వెళ్లి మందు కొడుతూ ఎంజాయ్ చేయడం చాలా ఇష్టం. దీంతో టప్పర్ రోజూ పీకల దాకా మందు కొట్టి పబ్బులోనే నిద్రపోయేవాడు. అయితే భార్య జేనే‌ కి మాత్రం అది ఇష్టం లేదు. దీంతో విసిగిపోయిన ఆమె టప్పర్‌ను ఇంట్లోనే ఉంచేందుకు ప్లాన్ చేసింది. అతను ఇంటి నుంచి బయటకు కాలు పెట్టనివ్వకుండా ఆ బారులోనే కూర్చొని మందుకొట్టేలా సకల సదుపాయాలు కల్పించింది. చివరికి అతడి స్నేహితులను కూడా ఆ బార్‌కు వచ్చే తాగాలని చెప్పింది. 

ఆ బార్ కు ‘డాగ్ హౌస్ ఇన్’ అనే పేరుపెట్టింది.  పబ్‌ కు ఏమాత్రం తేడా లేకుండా టప్పర్‌కు ఇష్టమైన అన్నిరకాల మద్యం బాటిళ్లను అందుబాటులో పెట్టింది. అలాగే, అతడి స్నేహితులను బయట పబ్బులకు వెళ్లకుండా తమ ఇంటికే వచ్చి తన భర్తకు కంపెనీ ఇవ్వాలని కోరింది.  

ఈ సందర్భంగా జెనే మాట్లాడుతూ.. టప్పర్‌ ఎప్పుడు చూసినా పబ్‌లు, బార్‌లు అంటూ తిరుగుతూ ఉండేవాడు. అది నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ఇంటి వెనుక ఉన్న ఖాళీ స్థలంలో ఆ పబ్బును కట్టించాను. నా భర్త కోసం ఎవరైనా వస్తే.. పబ్‌లో ఉన్నాడని చెప్పకుండా డాగ్ హౌస్‌లో ఉన్నాడని చెబుతా. అందుకే, దాన్ని ఆ డిజైన్‌ లో తయారు చేయించా. అంతేకాదు ఈ పబ్ ఉదయం వేళల్లో పిల్లలు ఆటలాడుకొనేందుకు, రాత్రి వేళల్లో భర్త మందు కొట్టేందుకు ఉపయోగపడుతోందని తెలిపింది.