ఇదేనా గుర్తింపు : స్టేడియం ఎదుట పండ్లు అమ్ముతున్న తైక్వాండో అంతర్జాతీయ క్రీడాకారిణి

ఇదేనా గుర్తింపు : స్టేడియం ఎదుట పండ్లు అమ్ముతున్న తైక్వాండో అంతర్జాతీయ క్రీడాకారిణి

క్రికెట్ లో ఫోర్, సిక్స్ కొడితే చాలు అబ్బో అని తెగ సంబరాలు.. బ్యాడ్మింటన్ లో టోర్నీ ఫైనల్ కు వెళితే చాలు జయహో భారత్ అంటూ చించుకుంటాం.. అదే ఏ ఇతర గేమ్స్ లో అయినా సరే అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తే మాత్రం అస్సలు పట్టదు ఎవరికీ. ఇలాగే అవమానమే మణిపూర్ లో ఒకటి వెలుగు చూసింది. తైక్వాండోలో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ.. సిల్వర్ మెడల్ సైతం సాధించిన ఓ క్రీడాకారిణి ఇప్పుడు క్రీడా స్టేడియం ఎదుట ఫ్రూట్ సలాడ్ అమ్ముకుంటూ జీవితం సాగిస్తుంది. అయినా పట్టువదలకుండా గోల్డ్ మెడల్ కోసం సాయంత్రం పూట ప్రాక్టీస్ చేస్తూ.. అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది.
Also Read : మానవ జాతికి రక్షణగా : ఏలియన్స్.. మనతో రహస్యంగా జీవిస్తున్నాయి!

నిధులు అందుతున్నంత కాలం.. ప్లేయర్లకు స్టేడియంలో నుంచి చప్పట్లు మోగుతూనే ఉంటాయి. ఐపీఎల్, నేషనల్ క్రికెట్, ఫుట్‌బాల్, బాడ్మింటన్ ఇలా టోర్నమెంట్‌ను బట్టి కొన్ని క్రీడలకే భారత్‌లో ఆదరణ కనిపిస్తోంది. క్రీడాభివృద్ధి పేరు చెప్పి నిధులు అందుతున్న వారికే మళ్లీ మళ్లీ సాయం అందుతుండటంతో క్రీడాదరణకు నోచుకోని ప్లేయర్ల పరిస్థితి దయనీయంగా మారింది.  

ఇదే విధంగా మణిపూర్‌కు చెందిన అంతర్జాతీయ తైక్వాండో క్రీడాకారిణి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ప్రూట్ సలాడ్ అమ్ముకుంటూ రోజుకు 300-400 రూపాయల వరకు సంపాదించుకుని అంతర్జాతీయ టోర్నీ ఆడాలని శ్రమిస్తోంది. 2006 నుంచి తైక్వాండో తన కెరీర్‌గా ఎంచుకుంది డయానా నింగోంబం. జాతీయ స్థాయిలో ఇప్పటికే 15 పతకాలు సాధించింది. 2018లో దక్షిణకొరియా వేదికగా జరిగిన అంతర్జాతీయ తైక్వాండో టోర్నీలో భారతదేశం తరపున ఆడి సిల్వర్ మెడల్ సాధించింది.

రోజంతా కష్టమే :
డయానా నింగోంబం దినచర్య చూస్తే కన్నీళ్లు వస్తాయి. దేశం తరపునే ఆడాలన్నా ఇంత కష్టపడాలా అనిపిస్తుంది. ప్రతి రోజూ ఉదయం 3 గంటలకే నిద్రలేస్తుంది. ప్రూట్ సలాడ్ ప్రిపేర్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఉదయం 4 గంటల నుంచి 7గంటల వరకూ క్రీడా స్టేడియం ఎదుట వాటిని అమ్ముతుంది. ఉదయం 8 గంటలకు ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటుంది. మధ్యాహ్నం తర్వాత ఇంట్లోనే మళ్లీ తైక్వాండో ప్రాక్టీస్ చేస్తోంది. సాయంత్రం 6 గంటలకు లోకల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌తో కోచ్ సమక్షంలో ప్రాక్టీస్ చేస్తుంది.

ఇంత కష్టపడుతున్నది హాంకాంగ్‌లో జరగబోయే ఇంటర్నేషనల్ టోర్నమెంట్ కోసమే. ఇంత కష్టపడటానికి కారణం.. తన కుటుంబ ఆర్థిక పరిస్థితి. తన కెరీర్.. కుటుంబానికి భారం కాకూడదనేది ఆమె తపన. తండ్రి ప్రింటింగ్ మిషన్‌కు మెకానిక్‌గా పని చేస్తున్నారు. క్రీడల్లో పాల్గొనాలంటే అతనికి వచ్చే డబ్బు సరిపోదు. అలా అని కలను చంపుకోలేక తానే కష్టపడి పోటీలకు వెళ్లాలని అనుకుంటుంది.

దేశవాలీ టోర్నమెంట్లలో 15 మెడల్స్ సాధించింది.. అంతర్జాతీయంగా సిల్వర్ మెడల్ కొట్టింది.. అయినా ప్రభుత్వ సాయం మాత్రమే లేదు. స్పోర్ట్స్ కోటా అంటాం కానీ.. ఇలాంటి వారి విషయంలో ఎందుకు న్యాయం జరగటం లేదో కూడా ఎవరికీ అర్థం కావటం లేదు. ‘అందరికీ నేను ఆదర్శం కావాలనుకుంటున్నాను. మన పని కోసం వేరే వాళ్ల మీద ఆధారపడాలనుకోవట్లేదు. మనమంతా డబ్బు అవసరమైనప్పుడే కష్టపడతాం. కానీ, నాకు రెండూ ఒకేసారి అవసరమైయ్యాడు. అందుకే ఫ్రూట్ సలాడ్‌లు అమ్ముతున్నా. ఫ్రూట్ సలాడ్‌లు కొనేందుకు వచ్చిన కొందరు కస్టమర్లు అసలు కంటే ఎక్కువ డబ్బు ఇచ్చి నన్ను ప్రోత్సహిస్తున్నారు. పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లకు స్పోర్ట్స్ వస్తువులు కొనాలన్నా కష్టంతో కూడుకున్న పనే’  అని తన ఆవేదనను వ్యక్తపరిచింది. 
Also Read : ‘ఫోని’ఎఫెక్ట్ : టూరిస్ట్ లు వెళ్లిపోమ్మంటున్న ఒడిశా ప్రభుత్వం