ధోనీ రిటైర్మెంట్ ఇవ్వకపోయుంటే.. : మాజీ సెలక్టర్

ధోనీ రిటైర్మెంట్ ఇవ్వకపోయుంటే.. : మాజీ సెలక్టర్

Ms-Dhoni

Ms Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టీ20 వరల్డ్ కప్ ఖచ్చితంగా ఆడేవాడంటూ మాజీ సెలెక్టర్ శరణ్‌దీప్ సింగ్ అంటున్నాడు. కరోనావైరస్ వ్యాప్తి గతేడాది చివర్లో ఆస్ట్రేలియా గడ్డపై జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్ 2022కి వాయిదా పడింది. 2019 వన్డే వరల్డ్ కప్‌లో చివరిగా బరిలోకి దిగిన ధోనీ.. ఆ తర్వాత జట్టుకు కొంతకాలం పాటు దూరంగా ఉండి రిటైర్మెంట్ ప్రకటించేశాడు.

దానిపై పెద్ద ఎత్తునే చర్చ జరిగింది. అయినప్పటికీ ధోనీ మాత్రం మౌనంగానే ఉన్నాడు. వన్డే వరల్డ్ కప్ గెలిచి రిటైర్మెంట్ ప్రకటిస్తాడనుకుంటే నిరాశే మిగిలింది. కనీసం టీ20 వరల్డ్‌కప్ ఆడైనా వీడ్కోలు చెప్తాడనుకుంటే.. ఎవరూ ఊహించని విధంగా ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పేశాడు.

కరోనా కారణంగా ఆటంకం కలగకపోయి ఉంటే.. షెడ్యూల్ ప్రకారం టీ20 ప్రపంచకప్ ఆడిన తర్వాతే ధోనీ రిటైర్ అయ్యేవాడని మాజీ సెలెక్టర్ శరణ్‌దీప్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఇంకా సక్సెస్‌ఫుల్ కెప్టెన్ అని, గెలవని ట్రోఫీ లేదని శరణ్ దీప్ కొనియాడాడు. టీ20 వరల్డ్‌కప్ ఆడేందుకు అన్ని అర్హతలు ఉన్నాయన్నాడు.

‘కరోనా వైరస్ అంతరాయం కలిగించకుండా ఉండుంటే..? ధోనీ టీ20 వరల్డ్‌కప్‌లో ఆడే ఉండేవాడు. మెరుగైన ఫిట్‌నెస్‌తో మెయింటైన్ చేస్తూ కూడా టీ20 వరల్డ్‌కప్‌ ఆడలేకపోవడానికి కారణాలేమీ కనిపించలేదు. అతని కెరీర్‌లో ఎప్పుడూ కూడా ప్రాక్టీస్‌కు డుమ్మా కొట్టలేదు. కొన్ని సందర్భాల్లో ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్‌ ఉన్నప్పటికీ.. సెషన్‌లో కనిపించేవాడు. గాయాల కారణంగా మ్యాచ్‌లకు దూరంగా ఉండటం చాలా అరుదు. ధోనీ అంటే అందరూ గౌరవం’గానే భావిస్తున్నారని శరణ్‌దీప్ సింగ్ వెల్లడించాడు.

‘టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు అన్ని విధాల అర్హుడని సెలెక్షన్ కమీటీ ఎప్పుడూ భావించేది. జట్టుకు ఎంతో సేవ చేశాడు. అతను గెలవని ట్రోఫీనే లేదు. నాతో సహా సెలెక్షన్ కమిటీలోని ప్రతి ఒక్కరి అభిప్రాయం ఇదే. యువ ఆటగాళ్లకు ఏం సూచనలిస్తావని పదే పదే అడిగేవాడిని. అతను మాత్రం ఎక్కువగా ఆలోచించకుండా గేమ్ యొక్క పరిస్థితులను అర్థం చేసుకోమని చెప్పేవాడినని తెలిపేవాడు’ అని శరణ్‌దీప్ చెప్పుకొచ్చాడు.