Brinjal Farming : వంగతోటలకు మొవ్వు, కాయతొలుచు పురుగుల బెడద

వంగతోటలకు వెర్రి తెగులు బెడద ఎక్కువయ్యింది. వైరస్ సోకటం వల్ల ఈ తెగులు ఆశిస్తుంది. పచ్చదోమ ద్వారా ఈ తెగులు ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాప్తిచెందుతుంది.  దీని లక్షణాలను గమనిస్తే  మొక్కలు గుబురుగా పెరిగి, చీపురు కట్టలా కన్పిస్తాయి.

Brinjal Farming : కోసిన కొద్దీ కాపు కాస్తూ… టన్నుల కొద్దీ దిగుబడినిచ్చే  పంట వంగ . కూరగాయల్లో దీనిది విశిష్ఠ స్థానం. 6నెలల పంటకాలంతో… వంగసాగు రైతుకు మంచి ఆదాయ వనరుగా మారింది. కానీ ఇటీవలి కాలంలో  ఈ పంటలో మొవ్వు, కాయతొలుచు పురుగు, వైరస్ తెగుళ్ల బెడద ఎక్కువవటం రైతులకు ఆందోళన కలిగిస్తోంది. వీటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

READ ALSO : Mushroom Cultivation : పుట్టగొడుగుల పెంపకంలో ఆసక్తిగల యువకులకు శిక్షణ ఇస్తున్న ఉండి కేవికే

తెలుగు రాష్ట్రాల్లో వంగను సుమారు లక్ష  ఎకరాల్లో సాగుచేస్తున్నారు. సంవత్సరం పొడవునా ఈ పంటను సాగుచేయవచ్చు.  వేసవిలో ఫిబ్రవరి నుంచి మార్చి  మొదటివారం వరకు నాటతారు. ప్రస్థుతం మార్కెట్లో వివిధ హైబ్రిడ్ రకాలు అందుబాటులోకి రావటం వల్ల ఎకరాకు 10-20 టన్నుల వరకు దిగుబడి సాధించే అవకాశం ఏర్పడింది. అయితే ఈ పంటకు మొవ్వు లేదా కాయతొలుచుపురుగు, వెర్రితెగులు బెడద రైతుకు ప్రధాన సమస్యగా మారింది. వీటిని సమర్ధంగా అరికట్టగలిగితే దిగుబడులు మరింత పెంచుకునే వీలుంది.

వంగను నాటిన 30-40రోజుల నుంచి మొవ్వుతొలిచే పురుగు ఆశిస్తుంది. మొక్కల తొలిదశలో మొవ్వును, తర్వాతి దశలో కాయలను తొలిచి నష్టాన్ని కలగజేస్తుంది. ఈ పురుగు ఆశించిన మొక్కల మొవ్వులు  వాడిపోతాయి. తర్వాతి దశలో కాయలకు రంధ్రాలుచేసి తినేస్తాయి.  ఒక్కో పురుగు సుమారు 4-6 కాయలను నష్టపరుస్తుంది. తద్వారా కాయలు అమ్మకానికి పనికిరావు. వీటిని అరికట్టాలంటే  పొలంలో నాటే ముందే నారును రైనాక్సీపైర్  5 మిల్లి లీటర్లు , లీటరు నీటిలో కలిపి అందులో  నారును 3 గంటలపాటు ఉంచి తర్వాత నాటుకోవాలి.

READ ALSO : Brinjal Crop : వంగతోటలను నష్టపరుస్తున్న వెర్రితెగులు.. నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు

పంట తొలిదశలో  పురుగు ఆశించిన  కొమ్మలను తుంచి, నాశనం చేయాలి. ఎకరాకు 10 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయాలి. పూత సమయంలో 5000 గుడ్లున్న  ట్రైకోగ్రామా కార్డులను ఆకుల అడుగుభాగంలో అమర్చుకోవాలి.  వేపనూనె 5 మిల్లి లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారి చేస్తే దీని తల్లి పురుగులు పంటపై గుడ్లు పెట్టటానికి ఇష్టపడవు. పంటపై పురుగు ఉధృతి గమనిస్తే  క్లోరాంట్రినిలిప్రోల్  0.3 నుండి 0.4 మిల్లి లీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయెట్ 0.4 గ్రాములు లేదా లామ్డా సైహాలోత్రిన్ 0.6 మిల్లి లీటర్లు లేదా థయోడికార్బ్ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ఇటీవలికాలంలో వంగతోటలకు వెర్రి తెగులు బెడద ఎక్కువయ్యింది. వైరస్ సోకటం వల్ల ఈ తెగులు ఆశిస్తుంది. పచ్చదోమ ద్వారా ఈ తెగులు ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాప్తిచెందుతుంది.  దీని లక్షణాలను గమనిస్తే  మొక్కలు గుబురుగా పెరిగి, చీపురు కట్టలా కన్పిస్తాయి. ఆకులు సన్నగా, చిన్నివిగా మారి పాలిపోయిన ఆకుపచ్చ రంగును కలిగి వుంటాయి.  పూత, కాత లేకుండా మొక్కలు గొడ్డుబారిపోతాయి. అందుకే దీన్ని వెర్రి తెగులు అని పిలుస్తారు.  ఇది వైరస్ తెగులు కాబట్టి దీనికి నివారణ లేదు. ఈ తెగులును వ్యాప్తిచేసే పచ్చదోమను తొలిదశలోనే నిరోధించాలి. దీనికి గాను మిథైల్ డెమటాన్ 2మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారిచేయాలి.

READ ALSO : Brinjal Shoot Borer Control : వంగలో కాయతొలుచు పురుగు నివారణ

వైరస్ సోకిన మొక్కలను పీకి నాశనంచేయాలి. లేకపోతే పచ్చదోమ ద్వారా ఈ వైరస్ ఇతర మొక్కలకు వ్యాప్తి చెందుతుంది. నారుమడి దశలో  నాటడానికి వారం రోజుల ముందు 250 గ్రా. కార్బోఫ్యురాన్ 3 జి గుళికలను 100 చదరపు మీటర్ల నారుమడికి వేయాలి. నాటిన 2 వారాల తర్వాత 2వ దఫాగా ఎకరాకు 8 కిలోల చొప్పున ఇవే గుళికలను వేయాలి. నాటే ముందు నారువేర్లను 1000 పి.పి.యమ్. టెట్రాసైక్లిన్ ద్రావణంలో ముంచి నాటుకోవాలి. నాటిన 4-5 వారాల తరువాత 7-10 రోజుల వ్యవధిలో డైమిథోయేట్  లేదా మిథేల్ డెమాటాన్ 2 మిల్లీ లీటర్లు లీటరు నీటిలో కలిపి 3 సార్లు పిచికారీ చేయాలి. తెగులు గమనించిన వెంటనే తెగులు సోకిన మొక్కలను పీకివేసి జిబ్బరిల్లిక్ ఆమ్లం 50 మిల్లి గ్రాములు , లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

ట్రెండింగ్ వార్తలు