Harvest Season Ahead
Harvest Season Ahead : అకాల వర్షాలతో ప్రతి ఏటా పంట నష్టం జరుగుతుండటంతో.. వానాకాలం, యాసంగి సాగును ముందుకు జరుపుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు వ్యవసాయ విశ్వవిద్యాలయం , వ్యవసాయ అధికారులు కూడా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. పంటకాలం ముందుకు జరుపుకోవడం వల్ల ప్రకృతి వైపరీత్యాల నుంచి కొంత వరకు బయటపడవచ్చని రైతులకు వివరిస్తున్నాం. ప్రస్తుతం వానాకాలం సీజన్‌ను కొన్నిచోట్ల రైతులు ప్రారంభించారు. వరి సాగు చేపట్టే రైతులు అందరూ పనులు మొదలుపెట్టాలని సూచిస్తున్నారు.
ఖరీఫ్ జూన్ నుంచి ఆరంభమవుతుంది. మృగశిర కార్తెలో విత్తుకుంటే పంట దిగుబడి వస్తుందని ఎప్పటి నుంచో రైతుల నమ్మకం. ఆ కాలంలో కార్తెల ప్రకారం వర్షాలు పడేవి. వరితో పాటు జొన్న, మొక్కజొన్న, సజ్జ, రాగులు, కంది, పెసర, మినుము వంటి ఆరుతడి పంటలు వేసుకునే వారు.
READ ALSO : Green Gram Cultivation : పెసర సాగులో అనుసరించాల్సిన యాజమాన్యం !
వర్షాలు అనుకూలంగా పడితే వేరుశనగ సైతం కొంతమంది రైతులు నేల స్వభావాన్ని బట్టి వేసేవారు. ఇప్పుడు నాటి వాతావరణ పరిస్థితులకు భిన్నంగా వర్షాలు పడుతున్నాయి. చేతికొచ్చిన పంటలు నేలపాలవుతన్నాయి. ఈ నేపథ్యంలో ఏ కార్తెలో విత్తుకోవాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. అందుకే పంటకాలాన్ని ముందుకు జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
READ ALSO : Corn Crop Cultivation : ఖరీఫ్ కు అనువైన మొక్కజొన్న రకాలు
సాధారణంగా వానాకాలంలో వరినాట్లు ఆగస్టు నెల వరకు వేస్తుంటారు. ఈ పంట దిగుబడి వచ్చే సమయంలో అంటే.. నవంబర్, డిసెంబర్‌లో వచ్చే తుపాన్లకు పంట దెబ్బతిని రైతు నష్టపోతున్నాడు. ఇలా కాకుండా మే నెల చివరి నుండి జూన్ రెండో వారంలోగా నార్లు పోసుకుని జూలైలో నాట్లు పూర్తి చేసుకుంటే తుపాన్లు అధికంగా వచ్చే సమయానికి పంట చేతికి వస్తుంది. అక్టోబర్‌లో పంట కోతకు వస్తుంది.
READ ALSO : Intercropping In Coconut : కొబ్బరిలో దోస, సొర, మినుము పంటల సాగు.. అంతర పంటలతో అదనపు ఆదాయం
దీంతో కొంత మేర నష్టం నుంచి బయటపడవచ్చు. అలాగే యాసంగి పంటకు అక్టోబర్ చివరి వారం నుంచి వరి నార్లు పోసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. డిసెంబర్ మొదటి వారంలోగా నాట్లు పూర్తి చేసుకోవాలి. ఇలా అయితే మార్చి చివరి నాటికి కోతలు పూర్తవుతాయి కాబట్టి ఏప్రిల్‌లో వచ్చే అకాల వర్షాల నుంచి రైతులు తప్పించుకోవచ్చు. ప్రతి సంవత్సరం ప్రత్యేకించి కొన్ని మండలాల్లో అకాల వర్షాల వల్ల నష్టం జరుగుతోంది. ఆయా మండలాల రైతులు పంటను ముందుగా వేసుకోవాలి. చాలా వరకు రైతులు స్వల్పకాలిక రకాలనే ఎంచుకోవాలని సూచిస్తున్నారు.
READ ALSO : Black Gram : వరిమాగాణుల్లో మినుము సాగుకు అనువైన రకాలు!
సాగర్ ప్రాజెక్ట్ కింద నీటిని ఆగస్టులో విడుదల చేస్తుంటారు. నీటి విడుదల అయ్యేలోగా బోర్ల ద్వారా నారు పెంచుకోవాలి. చెరువులు, రిజర్వాయర్ల కింద జూలైలో నీటిని విడుదల చేస్తారు. నాట్లు వేసే సమయానికి దాదాపు అంతటా నీరందుతుంది. నాన్ ఆయకట్టులో బోర్ల కింద ఎక్కువగా వరి సాగు చేస్తారు. మే, జూన్‌లో బోర్లలో కొంత నీరు తక్కువ వచ్చినప్పటికీ జూలైలో వర్షాలతో నీరు సరిపోతుంది. అంతే కాదు తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడినిచ్చే రకాలను సాగుచేయడం మినహా ఇతర మార్గాల్లో సీజన్‌ను ముందుకు మార్చే అవకాశాలు లేవు.