Neem Benifits : వేపతో వ్యవసాయంలో బహుళ ప్రయోజనాలు!
వేపచెక్కలో అమైనో అమ్లాలు , గంధకం ఉంటాయి. దీనిని పశువుల దాణాలో కలపడం వల్ల ఆహారంలో పోషక విలువలు పెరుగుతాయి. తాజా వేపాకులలో మాంసకృత్తులు , ఖనిజాలు ఉంటాయి.
- Guntupalli Ramakrishna
- Published On : May 3, 2022 / 03:01 PM IST
Neem Farming (1)
Neem Benifits : వ్యవసాయంలో వేప అన్నదాతలకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. వేప కొమ్మలు మొదలు, బెరడు, విత్తనాలు, ఆకులు, పూలు, వేర్లు, కాండం అన్నింటిని వినియోగించుకోవటం ద్వారా అనేక లాభాలు పొందవచ్చు. ఇంటి ఆవరణలోనే కాకుండా పొలం గట్లపైన కూడా వేప చెట్లను పెంచుకోవచ్చు. పంటలకు కీటకనాశినిగా, విత్తనశుద్ధికి, ధాన్యం నిల్వకు, సస్యరక్షణకు ఇలా ఎన్నో విధాలుగా వేపను అన్నదాతలు ఉపయోగించుకోవచ్చు.
వేప వల్ల వ్యవసాయంలో ఉపయోగాలు ;
కీటకనాశినిగా ; వేపచెట్టు కాయలను సేకరించి వాటిని కషాయంలా చేసుకుని పంటకు పిచికారీ చేసుకోవచ్చు. వేపపండ్ల ను నీటిలో నానబెట్టి విత్తనాన్ని వేరు చేసి తర్వాత విత్తనాలను ఆరబెట్టి లోపలి పపప్ను వేరు చేసుకోవాలి. ఈ పప్పును బాగా పొడిచేసి నీటిలో 24 గంటలపాటు నానబెట్టాలి. ఈ ద్రావణాన్ని వడపోసి 20 నిమిషాలపాటు బాగా పిండి పొడిని వేరు చేయాలి. 10 కిలోల వేపగింజల పొడిని 200 లీటర్ల నీటిలో నానబెట్టగా వచ్చే ద్రావణాన్ని నీటితో కలిపి పిచికారి చేస్తే కీటకాలు నాశనమౌతాయి.
విత్తనశుద్ధి లో ; విత్తనాలను ఆశించే పురుగులు, తెగుళ్ళబారి నుండి కాపాడుకోవాలంటే విత్తనశుద్ధి తప్పనిసరి. వేప పిండిని విత్తనాలకు కలిపి శుద్ధి చేస్తే ఆ విత్తనాలు పురుగులు, తెగుళ్ళు ఆశించకుండా చాలా కాలం నిల్వ ఉంటాయి. ఒక కిలో విత్తనానికి 10 గ్రా వేపపిండి కలిపి దాన్ని అన్నివిత్తనాలకు అంటుకునేలా శుద్ధి చేస్తే విత్తనాలు ఎక్కువ కాలం నిల్వ ఉండటమే కాక మంచి దిగుబడులు వస్తాయి.
ధాన్యం నిల్వలో ; ధాన్యం నిల్వ చేసేసమయంలో కీటకాలు ఆశిస్తుంటాయి. ధాన్యాన్ని నిల్వ ఉంచే ముందు వేప ఆకులు ధాన్యంలో కలుపుకోవాలి. తద్వారా ధాన్యాన్ని ఆశించే కీటకాల బెడద తగ్గుతుంది. ధాన్యం నిల్వ చేసే పంచులను వేపనూనెతో శుద్ధి చేస్తే కీటకాల నుండి కాపాడుకోవచ్చు.
పశు సంరక్షణలో ; వేపచెక్కలో అమైనో అమ్లాలు , గంధకం ఉంటాయి. దీనిని పశువుల దాణాలో కలపడం వల్ల ఆహారంలో పోషక విలువలు పెరుగుతాయి. తాజా వేపాకులలో మాంసకృత్తులు , ఖనిజాలు ఉంటాయి. వీటిని మేతగా వాడుకోవచ్చు. వేప ద్రావణం నీటిలో కలిపి స్నానం చేయించడం వలన పశువులకు చర్మ వ్యాధులు రాకుండా చూడవచ్చు. పశువుల పాకల్లో వేపాకులను, కొమ్మలను కాలిస్తే ఈగలు, దోమలు బెడదను తగ్గించుకోవచ్చు.
