Cotton Cultivation : పత్తి పంటలో గులాబిపురుగులను అరికట్టే పద్ధతులు

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 20 లక్షల హెక్టార్లలో పత్తి సాగవుతుంది. అయితే గులాబిరంగు పురుగు బెడద వల్ల సాగు విస్తీర్ణం ఏఏటికాయేడు తగ్గుతూ వస్తోంది. 

Cotton Cultivation : ప్రధానమైన వాణిజ్య పంటలలో పత్తి పంట ఒకటి. పత్తి పంటను తెల్ల బంగారం అని పిలుస్తారు. అయితే ప్రతి ఏటా ఈ పంటలో చీడపీడల వ్యాప్తి పెరగడంతో , పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది. గత మూడు, నాలుగేళ్ల నుండి గులాబీ రంగు పురుగు ఉధృతి పెరగడంతో రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతోంది. గత ఏడాది పత్తి సాగుచేసిన రైతులు, ఈ ఖరీఫ్ లో కూడా సాగుచేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే అధిక దిగుబడులను పొందాలంటే పత్తి తీతల అనంతరం నుండే మేలైన సమగ్ర యాజమాన్య చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు.

Read Also : Tulasi Cultivation : తులసి సాగుతో అధిక ఆదాయం పొందుతున్న గిరిజనులు

తెల్ల బంగారం అని పిలువబడే పత్తి పంట ప్రపంచంలో సుమారు 111 దేశాలలో సాగవుతుంది.  అందువల్లే దీనిని నార పంటల రారాజు అని అంటారు.  ప్రపంచం వ్యాప్తంగా ఈ పంటకు 1326 కీటక జాతులు ఆశిస్తే.. మన భారత దేశంలో 130 రకాల కీటకాలు ఆశిస్తున్నాయి. ఇందులో అత్యంత తీవ్రంగా నష్టపరిచే పురుగు గులాబిరంగు పురుగు. ఈ పురుగు ఆశించడంతో  2016 నుండి  పత్తి సాగు దిగుబడి తగ్గుతూ వస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 20 లక్షల హెక్టార్లలో పత్తి సాగవుతుంది. అయితే గులాబిరంగు పురుగు బెడద వల్ల సాగు విస్తీర్ణం ఏఏటికాయేడు తగ్గుతూ వస్తోంది.

గత ఖరీఫ్ పంట కాలంలో 30 నుండి 40 శాతం వరకు ఈ పురుగు ఆశించడం వల్ల నష్టం జరిగింది. అంటే ఈ పురుగు ఎంత ప్రమాదమో గమనించవచ్చు. ఈ పురుగు జీవిత చక్రాన్ని చూస్తే అక్టోబర్ , నవంబర్ మొదలుకొని పంట తీత ముగిసే వరకు ఉంటుంది. ఈ పురుగు జీవిత చక్రంలో 4 దశలు.. అనగా గ్రుడ్డుదశ, గొంగళి పురుగు, కోశస్థ, రెక్కల పురుగులుగా చూడవచ్చు. గ్రుడ్డు పొదిగి లార్వాదశకి చేరుకున్న 2 రోజుల్లోనే పత్తికాయలోకి చొచ్చుకొని పోయి విత్తనాన్ని తిని నాశనం చేస్తుంది. దీని వలన ప్రత్తి నాణ్యత దెబ్బతింటుంది.

గత ఏడాది సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు కురిసిన ఎడతెరిపి లేని వర్షాల కారణంగా సకాలంలో పంట  యాజమాన్య పద్ధతులు పాటించలేకపోవడంతో , గులాబిరంగు పురుగు ఉధృతి పెరిగింది. దీంతో దిగుబడి, నాణ్యత గణనీయంగా తగ్గింది. అంతే కాకుండా ఈ పురుగు ఆశించినందుకు పత్తి తీతలకు కూలీఖర్చు విపరీతంగా పెరిగింది. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని గులాబిరంగు పురుగు నివారణకు ముందస్తు సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త రాజేశ్వర్ నాయక్.

పత్తిలో సమగ్ర సస్యరక్షణ పద్ధతులు చేపట్టకపోవడం, గులాబిరంగు పురుగుకి కేవలం పత్తి పంట ఒక్కటే ఆహారం కావడం, 99 శాతం కేవలం బీటి పత్తిని మాత్రమే సాగుచేయడం లాంటి కారణాలవల్ల గులాబిరంగు పురుగు బీటి జన్యువులకు నిరోధక శక్తి పెంచుకోవడం జరుగుతుంది. ఈ విపత్కర పరిస్థితులను ఎదుక్కోవాలంటే సమగ్ర యాజమాన్య పద్ధతులన్ని అనుసరించాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రతి రైతు ఇప్పటి నుండే తగు జాగ్రత్తలు తీసుకుంటే, గులాబిరంగు పురుగును ఆదిలోనే అరికట్టి  నాణ్యమైన పత్తి దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది.

Read Also : Seeds Plants : ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు – విత్తన సేకరణలో పాటించాల్సిన మెళకువలు  

ట్రెండింగ్ వార్తలు