Pindinalli : దానిమ్మ, మామిడి, బొప్పాయి వంటి ఉద్యాన పంటలకు నష్టం కలిగిస్తున్న పిండినల్లి! నివారణ చర్యలు

ఈ పురుగు ఆశించిన మొక్కలను లేదా ఇతర మొక్కలను పొలంలో లేకుండా చూడాలి. మొక్కల కాండంపై సిఫార్సు చేసిన పురుగు మందు పూసి దీని యొక్క పిల్ల పురుగును ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వ్యాప్తి చెందకుండా చూడాలి.

Pindinalli :

Pindinalli : ఉద్యాన పంటలైన బొప్పాయి, దానిమ్మ, మామిడి, జామ, సపోటా, టమాట, వంగ, గులాబీ, బంతి, చామంతి వంటి పంటలలో పిండినల్లి అశించటం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంట దెబ్బతినటమే కాకుండా దిగుబడులు తగ్గుతున్నాయి. పిండి నల్లి ఆశించే భాగాలన్నీ తెల్లని దూదితో కప్పబడినట్లు ఉంటాయి. తల్లి మరియు పిల్ల పురుగులు లేత ఆకులు, కాండం మరియు కాయలపై ఆశించి రసాన్ని పీల్చడం వల్ల ఆయా భాగాలు ఎదుగుదల లేకపోవడం, ఆకులు ముడుచుకొని కుచించుకుపోయి గిడసబారిపోతాయి.

పిండినల్లి వల్ల పంటకు నష్టం ;

మొక్కల ఆకుల అడుగు భాగాన ఈనెల వెంబడి ఉండి తరువాత కాయల పైభాగాన చేరి రసాన్ని పిల్చుతాయి. ఆడ తల్లి పురుగులు రెక్కలు లేకుండా పసుపు రంగులో ఉండి శరీరమంతా తెల్లని మైనంతో కప్పబడి ఉంటాయి. పురుగు ఉధతి పెరిగినప్పుడు తేనె వంటి జిగురు పదార్ధాన్ని విసర్జించడం వల్ల మసి తెగులు వ్యాప్తి చెంది కిరణజన్య సంయోగ క్రియకు అంతరాయం కలుగుతుంది. అలాగే రసం పీల్చేటప్పుడు పురుగులు నుండి కొన్ని రకాల విష పదార్ధాలు మొక్కలోకి వెళ్ళడం ద్వారా చిన్న మొక్కలు ఎండిపోయి చనిపోతాయి. తల్లి పురుగు యొక్క గుడ్ల సముదాయం 150-160 గుడ్లను కలిగిఉంటుంది. దీని నుండి 10 రోజుల్లో గుడ్లు పొడగబడి, పిల్ల పురుగులు బయటకి వస్తాయి.

గాలి, సాగు నీరు, చీమలు మరియు వాడే పరికరాల ద్వారా ఆశించిన పొలం నుండి వేరే పొలంకు వ్యాపిస్తాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులను మరియు పిచికారి చేసిన మందుల నుండి కూడా తట్టుకోగలిగిన శక్తిని కలిగి ఉంటుంది. పిల్ల పురుగులు ఈ పిండి నల్లి స్రవించే తేనె లాంటి జిగురుకు చీమలు ఆకర్షించబడి అవి కూడా ఈ పిండినల్లిని వ్యాప్తి చేస్తాయి.

పిండి నల్లి నివారణ యాజమాన్యం ;

పిండి నల్లి ఉనికిని ముందుగానే గుర్తించ గలిగితే తేలికగా ఈ పురుగు వ్యాప్తిని అరికట్ట వచ్చును. ఈ పురుగు ఆశించిన మొక్కలను లేదా ఇతర మొక్కలను పొలంలో లేకుండా చూడాలి. మొక్కల కాండంపై సిఫార్సు చేసిన పురుగు మందు పూసి దీని యొక్క పిల్ల పురుగును ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వ్యాప్తి చెందకుండా చూడాలి. అలాగే చీమలు పిండి నల్లిని ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వ్యాపింప చేయడానికి చీమలు కీలకంగా చెప్పవచ్చు. కాబట్టి ముందుగా చీమలను అరికట్టాలి. ముందు జాగ్రత్త చర్యగా క్లోరోపైరిఫాస్‌ 20 ఇ. సి 2.0 మి.లీ లను లీటరు నీటికి కలిపి పొలంలో ఉన్న చీమల పుట్టలో పోసి నాశనం చేయాలి.

అలాగే అక్షింతల పురుగులు, అల్లిక రెక్కల పురుగులు, క్రిప్టోలిమాస్‌ మంట్రుజరీ అను బదనికలను పిండి నల్లీని తిని జీవిస్తాయి. ఎస్పాల్జిమస్‌ ఏపియస్‌ అనే సీతాకొక చిలుకలు కూడా ఈ పురుగు గ్రుడ్లను లార్వాలను మరియు తల్లి పురుగును తిని జీవిస్తాయి. బదనికలను ఒక ఎకరం బొప్పాయి తోటలో 2000 చొప్పున విడుదల చేయాలి. ఈ బదనికలు తోటలో విడుదల చేసిన తరువాత ఎటువంటి పురుగు మందును పిచికారి చేయకూడదు.

క్లోరోపైరిఫాస్‌ మందు ద్రావణంతో చెట్లు మొదలు తడపడం ద్వారా పిండి నల్ల్లి యొక్క మొదటి దశ పురుగులు వేరే మొక్కకు వ్యాపించకుండా నివారించవచ్చు. అలాగే వేపనూనె (2%) లేదా వేప గింజల కషాయం (5%) పిచికారి చేసుకోవాలి. ప్రోఫినోఫాస్‌ లేదా క్లోరోపైరిఫాస్‌ లేదా బుఫఫెజిన్‌ 2 మి.లీ లేదా థయోమిధాక్సాం 0.6 గ్రా లేదా ఇమిడాక్లోప్రిడ్‌ 0.6 మిలీ లీటరు నీటిలో కలిపి పిచికారి చేసుకోవటం ద్వారా దీనిని నివారించుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు