Ponguleti Srinivas Reddy: రూ.150 కోట్లతో శాశ్వత కరవు నివారణ.. మూడు మండలాలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు!
మూడు మండలాల్లో రూ.150 కోట్లతో శాశ్వత కరవు నివారణ చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి పొంగులేటి(Ponguleti Srinivas Reddy) తెలిపారు.
- V Santhosh Kumar
- Published on- October 25, 2026 / 09:50 AM IST
Telangana minister ponguleti announces 150 crore drought mitigation project journalist house sites
Ponguleti Srinivas Reddy: తెలంగాణ రాష్ట్రంలో కరవు పరిస్థితులు ఎప్పుడు తలెత్తినా ప్రజలు, రైతులు తట్టుకునేలా శాశ్వత నివారణ చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy)స్పష్టం చేశారు. జాతీయ విపత్తుల నిర్వహణ నిధి (NDRF) సహకారంతో రూ. 150 కోట్ల వ్యయంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడిన మంత్రి, మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్, నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల, నారాయణపేట జిల్లా మక్తల్ మండలాలను ప్రాథమికంగా ఈ పథకానికి ఎంపిక చేసినట్లు వెల్లడించారు.
గ్రామసభల నిర్వహణకు ఆదేశం.. పారదర్శకంగా పనుల నిర్వహణ:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు వర్షాధార వ్యవసాయ ప్రాంతాలు, నీటి వనరుల సమర్థ వినియోగం, రైతు కుటుంబాల జీవనోపాధిని మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ప్రకృతి విపత్తుల శాఖ పర్యవేక్షణలో వ్యవసాయ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని తెలిపారు. ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ గ్రామ, మండల స్థాయిల్లో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని, ప్రతి గ్రామంలో గ్రామసభలు నిర్వహించి స్థానిక అవసరాలకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి పారదర్శకంగా, లక్ష్యాన్ని చేరేలా చూడాలని అధికారులను కోరారు.
వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు.. కాంగ్రెస్ ప్రభుత్వం కీలక హామీ:
ఇదిలా ఉండగా, ఏళ్ల తరబడి ఇళ్ల స్థలాల కోసం నిరీక్షిస్తున్న అర్హులైన వర్కింగ్ జర్నలిస్టుల కల నెరవేరుస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు. ఎలాంటి చట్టపరమైన చిక్కులు లేకుండా, నివాసయోగ్యమైన ప్రాంతంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందన్నారు. గతంలోనే హౌసింగ్ సొసైటీకి భూమిని అప్పగించామని, త్వరలోనే అన్ని ప్రక్రియలు పూర్తి చేసి పత్రాలు అందిస్తామని తెలిపారు. సమావేశంలో విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, వ్యవసాయ శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్, డైరెక్టర్ గోపి తదితర అధికారులు పాల్గొన్నారు.
