దేశవ్యాప్తంగా మార్చి25న లాక్ డౌన్ విధించటంతో వలస కూలీలు, విద్యార్ధులు, తీర్ధయాత్రలకు వెళ్లిన వారు, ఇతర పనుల మీద వేరే రాష్టాలకు వెళ్లినవారు ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోయారు. అయితే, మే3 తో 2 వ సారి విధించిన లాక్ డౌన్ ముగుస్తుందనుకుంటుండగా….. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను మరో 14 రోజులు పాటు పొడిగించింది. అయితే వలస కూలీలకోసం , ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయినవారి కోసం మరి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలోని వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపాలని నిర్ణయించింది. ఇందుకోసం అధికారులు వలస కార్మికులను రైళ్ల ద్వారా వారి స్వస్థలాలకు పంపుతున్న సంగతి తెలిసిందే.
సొంత ప్రాంతాలకు చేరుకుంటున్న వలస కార్మికుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రానికి వచ్చే వలస కార్మికులకు రాష్ట్రంలో ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. గ్రామ సచివాలయాలను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్ గా తీసుకోవాలని ఆయన తెలిపారు.
ప్రతి గ్రామ సచివాలయంలో 10 నుంచి 15 మందికి వసతి కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో క్వారంటైన్ లో ఉండే వాళ్లకు భోజనం, వసతి కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. లక్ష బెడ్స్ ను అందుబాటులో ఉంచేలా చూడాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.
అంగన్‌వాడీలు, మెప్మా, పంచాయతీరాజ్ శాఖ గ్రామాల్లో కరోనా క్వారంటైన్ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. 500 ఆర్టీసీ బస్సులను నిత్యావసరాలను తీసుకెళ్లే మొబైల్ వాహనాలుగా మార్చాలని సీఎం ఆదేశించారు. ఇందులోనే వీలైనంత వరకు ఫ్రీజర్లు ఏర్పాటుచేసి పాలు, పెరుగు, గుడ్లు, పండ్లు, లాంటి నిత్యావసరాలను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.
కేసుల తీవ్రత ఉన్న క్లస్టర్లలో ప్రజల కదలికలను కట్టడి చేసి నిత్యావసరాల కోసం ఒక వ్యక్తికే పాసు ఇవ్వాలని సీఎం తెలిపారు. వైద్యుడు, ఏఎన్‌ఎం,ఆశా కార్యకర్త, మందులు కూడా మొబైల్ యూనిట్‌కు అందుబాటులో ఉంచాలని సీఎం అన్నారు.
కేంద్ర హోంశాఖ ఇచ్చిన సూచనల మేరకు ఎక్కడెక్కడ కంటెన్‌మెంట్ జోన్లు ఉండాలన్న దాన్ని గుర్తించి, అక్కడ అనుసరించాల్సిన విధానాలపై విధివిధానాలు తయారుచేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అనుమతులు ఉన్న దుకాణాల వద్ద పాటించాల్సిన ఎస్‌ఓపీలను ఇవ్వాలని సీఎం తెలిపారు.