ACB Rides : ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇళ్లలో ఏసీబీ సోదాలు
ACB Rides : దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కలిగిరి శాంతి ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
- Harishth Thanniru
- Published On : April 7, 2026 / 02:04 PM IST
ACB raids
- ఎండోమెంట్ శాఖ అధికారి శాంతి ఇళ్లలో ఏసీబీ సోదాలు
- ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు
- తాడేపల్లిలోని నివాసం సహా మూడు ప్రాంతాల్లో తనిఖీలు
ACB Rides : దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కలిగిరి శాంతి ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం తాడేపల్లిలో ఆమె నివాసం ఉంటున్న ఇంటితోపాటు మూడు ప్రాంతాల్లో విజయవాడ ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. చట్టబద్ద ఆదాయానికి మించి ఆస్తులు కూడాబెట్టినట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఏసీబీ సోదాల్లో కీలక పత్రాలు, ఆస్తుల వివరాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
ఏపీ దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేసిన కళింగిరి శాంతి పలు వివాదాస్పద నిర్ణయాల కారణంగా ‘సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అప్పటి ఎంపీ విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహితురాలిగా ఉంటూ.. భూ దందాలు, దేవాదాయ ఆస్తుల అక్రమ బదిలీలు పాల్పడినట్లు శాంతిపై ఆరోపణలు వచ్చాయి. వీటిపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విచారణ చేపట్టింది. ఈ క్రమంలో 2024 జులై2న ఆమెపై సస్పెండ్ వేటు పడింది. విచారణలో భాగంగా ఆమెపై మొత్తం 15కు పైగా అభియోగాలు నమోదయ్యాయి.
శాంతిపై సస్పెన్షన్ వేటువేసి ఏడాది దాటినా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోకపోవడంతో ఆమె ఏపీ హైకోర్టును, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తగిన కారణం లేకుండా ఒక ఉద్యోగిని ఏడాది కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్‌లో ఉంచడం చెల్లదని ఆమె తరపు న్యాయవాదులు వాధించారు. ఈ వాదనతో ఏకీభవించిన హైకోర్టు ఆమె సస్పెన్షన్‌పై పున: సమీక్ష జరపాలని ఫిబ్రవరి 2026లో కీలక ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టు, ఎస్టీ కమిషన్ ఆదేశాల మేరకు సస్పెన్షన్ ఎత్తివేసి ఆమెను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గత నెలలో శాంతికి అప్రాధాన్య పోస్టింగ్ ఇవ్వాలని ఎండోమెంట్ ఎక్స్ అఫీషియో కార్యదర్శి హరి జవహర్ లాల్ ఆదేశాలు జారీ చేశారు. అయితే, ప్రస్తుతం ఆమెకు సంబంధించి నివాసాలు, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేయడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
