AP High Court on Alla RK Case : గత ప్రభుత్వ హయాంలో కేసులు.. సీఎం చంద్రబాబుకి భారీ ఊరట.. 3 పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
AP High Court on Alla RK Case : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.
- Dharani Pilli
- Published On : March 30, 2026 / 03:27 PM IST
amaravati inner ring road case High Court Dismisses Petition Against Chandrababu filed by alla ramakrishna reddy
AP High Court on Alla RK Case : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి భారీ ఊరట లభించింది. ఈ వ్యవహారంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి గతంలో దాఖలు చేసిన మూడు వేర్వేరు పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. దీంతో గత కొన్నాళ్లుగా కొనసాగుతున్న ఈ వివాదంలో చంద్రబాబు నాయుడికి న్యాయపరంగా భారీ ఊరట లభించినట్లైంది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ వ్యవహారానికి సంబంధించి ఆళ్ల రామకృష్ణారెడ్డి మూడు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని విన్నవించడంతో పాటు.. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని.. అలానే ఈ కేసును ఏసీబీ కోర్టు విచారిస్తుండగా.. దాన్ని ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి మూడు వ్యాజ్యాలు దాఖలు చేశారు.
తాజాగా వీటిని విచారించిన ఏపీ హైకోర్టు.. ఈ మూడు పిటిషన్లకు విచారణార్హత లేదని స్పష్టం చేస్తూ వాటిని కొట్టివేసింది. ఇదిలా ఉంటే.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను తమకు అనుకూలమైన వారి భూముల గుండా మార్చారంటూ గత ప్రభుత్వం హయాంలో ఈ కేసు నమోదైంది. దీనిపై సుదీర్ఘ కాలంగా న్యాయపోరాటం జరుగుతోంది. తాజాగా హైకోర్టు తీసుకున్న నిర్ణయంతో ఈ మూడు పిటిషన్ల వ్యవహారానికి తెరపడింది. రాజకీయంగానూ, న్యాయపరంగానూ ఈ తీర్పు చంద్రబాబుకు సానుకూల అంశంగా మారింది.
