ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జూన్ 16 నుంచి ప్రాంరంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన దస్త్రాన్ని అసెంబ్లీ కార్యదర్శి గవర్నర్ కు పంపారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. 16వ తేదీన గవర్నర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. 18వ తేదీన బడ్జెట్ సమర్పణ ఉంటుంది. ఈ నెల 19నరాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది.
బడ్జెట్ సమావేశాలు సాధారణంగా ఫిబ్రవరి మూడోవారంలో మొదలై మార్చి 31వరకు జరుగుతాయి. కానీ కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా లాక్ డౌన్ విధించటంతో సమావేశాలు నిర్వహించలేదు. ఏప్రిల్ 1 నుంచి జూన్ నెలాఖరుదాకా.. మొదటి త్రైమాసికానికి రూ.70 వేల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేశారు. ఈ నెలాఖరుతో ఆ ఆర్డినెన్స్ కాలపరిమితి ముగుస్తోంది. దీంతో బడ్జెట్ సమావేశాలను నిర్వహించి పూర్తిస్థాయి బడ్జెట్ సమర్పించాల్సి ఉంది.
16వ తేదీన గవర్నర్ ప్రసంగం అనంతరం…. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ మీటింగ్ జరుగుతుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరపాలో నిర్ణయిస్తారు. 18వ తేదీన ఉదయం కేబినెట్ సమావేశమై రాష్ట్ర బడ్జెట్‌ను ఆమోదిస్తుంది. అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు. వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కురసాల కన్నబాబు సమర్పిస్తారు. శాసనమండలిలోనూ వీటిని ప్రవేశ పెడతారు. 31 వరకు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇలా ఉండగా…గత మార్చి 26న జరగాల్సిన రాజ్యసభ ఎన్నికల పోలింగ్… కరోనా కారణంగా దేశవ్యాప్తంగా వాయిదా వేశారు. రాజ్యసభ ద్వై వార్షిక ఎన్నికల పోలింగ్ను ఈనెల19న జరుపుతామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏపీలోని 4 రాజ్యసభ స్ధానాలకుగాను ఐదుగురు బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి మంత్రులు పిల్లిసుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, రాంకీ అయోధ్యరామిరెడ్డి, రిలయన్స్ గ్రూప్ నకు చెందిన పరిమళ నత్వానీ నామినేషన్లు దాఖలు చేయగా..సంఖ్యాబలంలేకున్నా ఆఖరి నిమిషంలో టీడీపీ నుంచి వర్ల రామయ్య కూడా నామినేషన్ దాఖలు చేశారు.