Chandrababu : దేవతల రాజధాని అమరావతి.. అందుకే జగన్ కి ఆ పేరు పలకడం ఇష్టం లేదు : సీఎం చంద్రబాబు
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతి దేవతల రాజధాని అని.. అందుకే ఆ పేరు జగన్ కి ఇష్టం లేదన్నారు.
- Dharani Pilli
- Published On : April 3, 2026 / 02:45 PM IST
andhra pradesh cm chandrababu naidu slams ys jagan over mavigun
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జగన్ ప్రతిపాదించిన నూతన రాజధాని మావిగన్ పై స్పందిస్తూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘దేవతల రాజధాని పేరైన అమరావతిని పలకడం ఇష్టం లేకే జగన్ మావిగన్ పేరు తెర పైకి తెచ్చారు. హిందూమతం పై ద్వేషంతో తిరుమల శ్రీవారికి అపచారం తలపెట్టిన వారు అమరావతి పేరు పలకటానికి ఇష్టపడతారా’ అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
‘ఒంటిమిట్టలో శ్రీరామ కల్యాణంలో పాల్గొన్న వేళ లోక్ సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందింది. రాజ్యసభలో బిల్లు పాస్ అయిన వేళ పోలవరం డయాఫ్రామ్ వాల్ కూడా పూర్తి అయ్యింది. ఇంత జరుగుతున్నా వైసీపీ నేతలు అహంకారం ప్రదర్శిస్తున్నారు. ఉభయ సభల్లో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందితే ఓర్వలేక పోతున్నారు. ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని ఏమిటి.. పార్లమెంటు ఓ చట్టం చేస్తే దానిని అమలు చేయాల్సిన రాజకీయ పార్టీలు.. తమకు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తామంటే ఎలా’ అంటూ ప్రశ్నించారు.
‘దేశమంతా ఆంధ్రప్రదేశ్ కు మద్దతు పలికి అమరావతి నిర్మాణం కావాలని, దేశాభివృద్ధికి దోహదం చేయాలని సంఘీభావం తెలియజేశారు. వారందరినీ తప్పుపట్టేలా వైసీపీ వింత ప్రవర్తన ఉంది. ఇకనైనా వారు మారితే మంచిదంటూ’ సీఎం చంద్రబాబు హితవు పలికారు.
