AP Police Special Leave : ఏపీ సర్కార్ శుభవార్త.. ఆ ఉద్యోగులకు 2 ప్రత్యేక సెలవులు.. బర్త్ డే, పెళ్లి రోజు నాడు హాలీడే!

AP Police Special Leave : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ శాఖ ఉద్యోగులకు రెండు ప్రత్యేక సెలవులు మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

andhra pradesh dgp orders to grant special leave to police employees on their birthdays and wedding anniversaries

  • పోలీసు సిబ్బందికి ఏపీ సర్కార్ శుభవార్త
  • వారికి రెండు ప్రత్యేక సెలవులు
  • పెళ్లి రోజు, బర్త్ డే నాడు హాలీడే

AP Police Special Leave : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పోలీసు శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి తీపి కబురు చెప్పింది. వారి కోసం ‘వేడుక సెలవు’ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ఇకపై పోలీసు శాఖలో పనిచేస్తున్న ప్రతి సిబ్బంది తమ పుట్టినరోజు మరియు పెళ్లి రోజునాడు సెలవు తీసుకోవచ్చు. సాధారణంగా పోలీసు ఉద్యోగం అంటేనే సెలవులు లేని కొలువు. పండుగలు, వేడుకలు అనే తేడా లేకుండా.. ప్రతిక్షణం ప్రజల భద్రత కోసం విధి నిర్వహణలోనే ఉంటారు. దీంతో ముఖ్య సందర్భాలు, పండుగల సమయంలో పోలీసు సిబ్బంది తమ కుటుంబంతో సంతోషంగా సమయం గడిపేందుకు అవకాశం లభించడం లేదు.

ఈ క్రమంలోనే ఏపీ సర్కార్ పోలీసుల సంక్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. వారి వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యతనిచ్చేలా వేడుక సెలవు విధానాన్ని అమలు చేయాలంటూ డీజీపీ (DGP) కార్యాలయం నుంచి తాజాగా అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. దీని ప్రకారం ఇకపై పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగి.. వారి పుట్టినరోజు మరియు పెళ్లి రోజునాడు సెలవు తీసుకోవచ్చు. కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారి వరకు అందరికీ ఈ సెలవు వర్తిస్తుంది. దీనివల్ల పోలీసు సిబ్బంది కూడా తమ జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజుల్లో కుటుంబంతో కలిసి సంతోషంగా సమయం గడిపేందుకు అవకాశం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఏవైనా అత్యవసర పరిస్థితులు (ఉదాహరణకు శాంతిభద్రతల సమస్యలు లేదా పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు) ఉంటే తప్ప, మిగిలిన సమయాల్లో పోలీసు సిబ్బంది ఈ వేడుక సెలవు అడిగినప్పుడు యూనిట్ అధికారులు ఖచ్చితంగా మంజూరు చేయాలని డీజీపీ స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల పోలీసు శాఖ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.